బెంగాల్‌లో పలు నియోజకవర్గాల్లో ముక్కోణ సమరం

బెంగాల్‌లో పలు నియోజకవర్గాల్లో ముక్కోణ సమరం– ఢీకొీంటున్న లెఫ్ట్‌-కాంగ్రెస్‌, టిఎంసి, బీజేపీ మధ్య టఫ్‌ఫైట్‌
జె.జగదీష్‌
బెంగాల్‌లోని పలు నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. ముర్షిదాబాద్‌లో జరిగిన ప్రచారంలో వామపక్ష కూటమి అభ్యర్థి ముహమ్మద్‌ సలీం స్పష్టమైన ఆధిక్యత సాధించడమే కాకుండా.. బహరంపూర్‌, డమ్‌డమ్‌, జాదవ్‌పూర్‌, శ్రీరాంపూర్‌, దక్షిణ కలకత్తా, బషీర్‌హట్‌, కృష్ణానగర్‌ నియోజకవర్గాలలో వామపక్ష, కాంగ్రెస్‌ అభ్యర్థుల జోరు టీఎంసీ, బీజేపీ అభ్యర్థులను వణికిస్తున్నది. వారు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
నేతల అరెస్టులతో ఇబ్బందుల్లో టీఎంసీ
బషీర్‌హట్‌ లోక్‌సభ నియోజకవర్గం సందేశ్‌ఖాలీ వరుస సంఘటనలు జరిగిన ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇక్కడ టీఎంసీ విస్తృతంగా భూసేకరణకు, లైంగిక హింసకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. టీఎంసీ నేతల అరెస్ట్‌తో వారి పరిస్థితి ఇక్కడ నానాటికీ దిగజారుతోంది. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘోర నేరాలను బయటకు తీసుకొచ్చి బాధితుల కోసం పోరాడిన మాజీ ఎమ్మెల్యే నిరపడ సర్కార్‌ ఈ ఎన్నికల్లో లెఫ్ట్‌ అభ్యర్థి. వ్యవసాయ కార్మికుల నాయకుడిగా ఉంటూ నియోజకవర్గంలో ఆదరణ పొందారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు జరిపినందుకు మమత ప్రభుత్వం ఆయనను జైలులో పెట్టింది. బీజేపీ అభ్యర్థిగా రేఖపాత్ర పోటీ చేస్తుండగా, మాజీ ఎంపీ హాజీ నూరుల్‌ ఇస్లాంను టీిఎంసీ రంగంలోకి దింపింది.
హోరా హోరీ
దక్షిణ కలకత్తాలో సీపీఐ(ఎం) అభ్యర్థి, సైరా హలీమ్‌ షా సామాజిక కార్యకర్త, సినీనటి ప్రముఖ నటుడు నస్రుద్దీన్‌ షా మేనకోడలు. మమతా బెనర్జీ నివాసం ఉండే కాళీఘాట్‌ ప్రాంతంలో సైరా ప్రచారాన్ని టీఎంసీ అడ్డుకుంది. గతేడాది జరిగిన బల్లిగంజ్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో సైరా పెద్ద సంఖ్యలో ఓట్లు తెచ్చుకొని టీఎంసీకి, బీజేపీకి షాకిచ్చారు.
బీజేపీ దయనీయంగా మూడో స్థానంలో నిలిచింది. బెంగాల్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు ఫౌద్‌ హలీమ్‌ భార్య నియోజకవర్గంలోని ప్రతి గడపలో ప్రచారం చేస్తున్నారు. కలకత్తా మేయర్‌ మాయా రారు (టీఎంసీ), దేబాశ్రీ చౌదరి (బీజేపీ).ఇక్కడ బరిలో ఉన్నారు. శ్రీరాంపూర్‌ నియోజకవర్గంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా జాయింట్‌ సెక్రటరీ దీప్సితా ధర్‌ పెద్ద ఉద్యమం చేశారు. అహంకారపూరిత ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్న కళ్యాణ్‌ బెనర్జీని టీఎంసీ మళ్లీ బరిలో దింపింది. బీజేపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త కబీర్‌ శంకర్‌ బోస్‌ బరిలోకి దిగారు. జాదవ్‌పూర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య, టీఎంసీకి చెందిన సయానీ ఘోష్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. శ్రీజన్‌ ప్రచార కార్యక్రమాలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అనిర్‌బెన్‌ గంగూలీ.
అధిర్‌ రంజన్‌ చౌదరిపై క్రికెటర్‌ పఠాన్‌
డమ్‌డమ్‌ నియోజకవర్గంలో టీఎంసీ సిట్టింగ్‌ ఎంపీ సౌగతా రారుపై సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్‌ చక్రవర్తి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం టీఎంసీ పాశవిక దాడులకు వేదికైంది. బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా దత్తా ఇక్కడ పోటీ చేస్తున్నారు. బహరంపూర్‌లో కాంగ్రెస్‌ లోక్‌సభ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరి వామపక్ష కూటమి మద్దతుతో పోటీ చేస్తున్నారు. టీఎంసీ అభ్యర్థిగా క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ను రంగంలోకి దింపింది. బీజేపీ నిర్మల్‌ కుమార్‌ సాహాను పోటీలో నిలిపింది. అధీర్‌ రంజన్‌ ప్రచారంలో వామపక్ష కూటమి కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నారు.