గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్‌ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలివ్వాలి

–  గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్‌, డైలీవేజ్‌, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలివ్వాలనీ, రాష్ట్రవ్యాప్తంగా ఒకటే హోదాను అమలు చేయాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్‌, డైలీవేజ్‌, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీనికి యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.బ్రహ్మచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. 35 ఏండ్లుగా డైలీవేజ్‌ వర్కర్లుగా పిలవబడుతూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టల్స్‌ ఆశ్రమ, పాఠశాలలో 3,070 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్థిక శాఖ డైలీవేజ్‌ అనే పదాన్ని ఆమోదించటం లేదనే సాకుతో వారిని ఔట్‌సోర్సింగ్‌ కార్మికులుగా మార్చి వేతనాలు తగ్గించాలనే ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా ఉన్న వేతనాన్ని తగ్గించడం చట్ట వ్యతిరేక చర్య అని అభివర్ణించారు. జీవో నెంబర్‌ 70లో ప్రభుత్వమే డైలీవేజ్‌ ప్రాతిపదికన కార్మికులను తీసుకోవాలనీ, కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్లను నియమించాలని జీవో ఇచ్చిందని గుర్తుచేశారు. 1994కి ముందు నుంచే 400 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారనీ, వారిలో ఇప్పుడు 150 మంది పేర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పటం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రమేర్పడే నాటికి ఐదేండ్ల సర్వీస్‌ కలిగిన కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.