నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం ఆగస్టు 9 న జరుగుతున్న ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్ ఒక ప్రకటనలో కోరారు. ఆదివాసి,గిరిజన తెగల హక్కులను రక్షించడం, స్వయంపాలన, జీవన విధానం, సంస్కృతి,ఆచార వ్యవహారాలను గౌరవించడం, గిరిజనుల అభివృద్ధి, భాషల గుర్తింపు,విద్య,ఆరోగ్యం వంటి లక్ష్యాలను సాధించే దిశగా పాలక ప్రభుత్వాలు కృషిచేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపు నిచ్చిందన్నారు. ఆదివాసి గిరిజన తెగలు తమ హక్కుల సాధన కోసం భారత దేశంతో పాటు 90 దేశాలు ఐక్యరాజ్యసమితి తీర్మానం పై సంతకాలు చేశాయని గుర్తు చేశారు. అంతటి ప్రాధాన్యత కలిగిన రోజును కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆగస్టు 9వ తేదీన జరుగుతున్న ప్రపంచ హక్కుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివాసి గిరిజన తెగలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఉమ్మడి సామూహిక జీవన విధానం,సంస్కృతి,ఆచారాలు,ఆహారఅలవాట్లపై తీవ్రమైన దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని గిరిజనుల హక్కులు,చట్టాలను కాలరాస్తోందని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో విలువైన ఖనిజ సంపదను కార్పోరేట్లకు పెట్టబెట్టేందుకు 2023లో నూతన అటవీ సంరక్షణ నియమాల చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. దీనివలన కోట్లాదిమంది ఆదివాసి గిరిజనులు బలవంతంగా అడవుల నుండి గెంటివేయబడతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై ఈ సందర్భంగా గలమెత్తాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని లేకపోతే ప్రత్యక్ష పోరాటాలకు పూనుకుంటామని హెచ్చరించారు.