గిరిజన బాలికలు క్రీడల్లో రాణించాలి

గిరిజన బాలికలు క్రీడల్లో రాణించాలి– కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
గిరిజన బాలికలు క్రీడారంగంలో అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా సిద్ధం కావాలని కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల క్రీడా పాఠశాలలు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఆర్‌. రమాదేవి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్‌లతో కలిపి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. గిరిజన బాలికల పాఠశాల నుంచి జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు పట్టుదలతో శ్రమించి మరింత తర్ఫీదు ఇచ్చి అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాణించాలన్నారు. క్రీడా పాఠశాలలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పాఠశాలలో నాటిన మొక్కలను విద్యార్థులు ఒక్కొక్క దానిని దత్తత తీసుకొని వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భుజంగరావు, డివిజనల్‌ పంచాయతీ అధికారి ఉమర్‌ హుస్సేన్‌, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌, ఏసీఎంఓ ఉద్దవ్‌, ఏటీడీఓ క్షేత్రయ్య, గిరిజన క్రీడ అధికారి బండ మీనారెడ్డి, క్రీడా పాఠశాల హెచ్‌ఎం కృష్ణారావు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ప్రజాపాలన దరఖాస్తులు వేగంగా పరిశీలించాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు అందేలా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లాలోని ఆసిఫాబాద్‌ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన సేవా కేంద్రాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి ఉమర్‌ హుస్సేన్‌లతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, ప్రక్రియ నిర్వహణలో తలెత్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పరిశీలన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.
ఆదివాసీ జాతుల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం
జిల్లాలోని ఆదివాసీ జాతుల అభివృద్ధికి, ప్రతి గిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమం పథకాల ఫలాలు అందించేందుకు సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో గిరిజన అభివృద్ధి, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా, జిల్లా అదనపు కలెక్టర దీపక్‌ తివారితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విద్య, వైద్యం అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీస మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివాసీ గ్రామాలకు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. మారుమూల గ్రామాలను జిల్లా కేంద్రానికి అనుసంధానం చేస్తూ అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిపేందుకు ఆదివాసీ నాయకులు, కుల పెద్దల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం బట్‌, డీటీడీఓ రమాదేవి, ఆదివాసీ నాయకులు సిడాం అర్జు, కుర్సింగ మోతిరామ్‌, మడావి గుణవంతరావు, ఆత్రం భీమ్‌రావు, పెందూరు సుధాకర్‌, పోచయ్య, కుల సంఘాల నాయకులు, సర్‌ మెడీలు పాల్గొన్నారు.