ఓ వైపు కేంద్ర ప్రభుత్వం అడవులను భక్షిస్తూ, చట్టాలను బడా కార్పొరేట్ల కోసం సవరిస్తూ మైనింగ్ నాన్‌మైనింగ్ పేరుతో ‘జల్ జంగల్ జమీన్’ నుండి ఆదివాసీలను తరిమికొడుతున్నది. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం మార్గదర్శ కత్వంలోనే నడుచుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. మన పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణ ఈ ఏడాది విస్తారమైన ప్రాంతంలో రద్దు చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశించింది. వందల కోట్ల రూపాయల ఉపాధిని ఆదివాసీలు, పేదలు వేసవి సీజన్‌లో కోల్పోబో తున్నారు. మన రాష్ట్రంపై దీని ప్రభావం ఎలా ఉండబోతున్నదనేది ఆందోళనకరమైన అంశం. గతేడాది కొమురంభీమ్ జిల్లాలో తునికాకు సేకరణ రద్దు నిర్ణయాన్ని వెనక్కి కొట్టడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ఏర్పడి ఏడాది గడిచినప్పటికీ గిరిజన శాఖకు మంత్రిని కూడా నియమించలేదు. గిరిజన శాసనసభ్యులతో కూడిన ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ (టిఎసి) సమావేశాలు అస్సలు జరగ టం లేదు. ఐటిడిఎ పాలక మండలి సమావేశాలు లేనేలేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పాలమూరు ఉమ్మడి జిల్లా మన్ననూరు ఐటిడిఏకు రెగ్యులర్ ప్రాజెక్టు ఆఫీసర్ (ఐఏఎస్ అధికారి)లేకపోవటం గిరిజనుల పట్ల నిర్లక్ష్యానికి, వివక్షకు పరకాష్ట.
గత కేసీఆర్ ప్రభుత్వం పోడుభూముల సాగుదారులపై నిర్భంధం ప్రయోగించినప్పటికీ చివరిలో నాలుగున్నర లక్షల ఎకరాలకు హక్కు పత్రాలివ్వడం సానుకూలమైన అంశం. అయితే తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పోటీ పడి తమ మ్యానిఫెస్టోలో పెండింగ్‌లో ఉన్న మొత్తం సమస్యలు పరిష్కారం చేస్తామని హామీలిచ్చాయి. నేటివరకు అధికార పార్టీ పోడు భూముల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెంటనే హామీ అమలు కోసం రోడ్ మ్యాప్ ప్రకటించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఎజీఎస్), వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీల పట్ల అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలను ఇక్కడ కొనసాగించాలని చూస్తే ప్రతిఘటన మాత్రం తప్పదు. ఇంకా ఎనిమిది లక్షల ఎకరాలకు హక్కు పత్రాలివ్వాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తోంది. హక్కుపత్రాలు, అలాగే ఇతర డిమాండ్ల సాధనకు ఆదివాసీలు గత కొంతకాలంగా వివిధ రూపాల్లో పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నారు. నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు.
ఆదివాసీలు డిమాండ్ చేస్తున్న అంశాలు
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దశాబ్దాల నుండి నివాసముంటున్న ఎస్టీ కోయ ఆదివాసి షెడ్యూల్ తెగలకు చెందిన గొత్తి కోయ వలస ఆదివాసీలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. వారు పుట్టుకతో ఆదివాసీలు అయినప్పటికీ ఎటువంటి ప్రభుత్వ పథకాలు వీరికి అందటం లేదు. ప్రభుత్వం చర్చించి వీరికి తగిన న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలి. తునికాకు లభ్యమయ్యే అన్ని యూనిట్లలో ఆకు సేకరణ జరిగేలా టెండర్లు వెంటనే నిర్వహించాలి.అలాగే తునికాకు కార్మికులకు అటవీశాఖ నుండి రావాల్సిన బోనస్’ బకాయిలను వెంటనే చెల్లించాలి. ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున అవతవకలు జరుగుతున్నందున నగదు రూపంలో గ్రామసభలో డబ్బులు చెల్లించేందుకు తగు చర్యలు తీసుకోవాలి, కట్టరేటు రూ.5లు నిర్ణయించాలి.నకిలీ కులధృవీకరణ, ఏజెన్సీ ధృవీకరణ పత్రాలపై ఐటీడీఏల ద్వారా విచారణ చేసి, నకిలీ ధృవపత్రాలను జారీచేసిన అధికారులపై కేసులు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. రైతు రుణమాఫీ ఆదివాసీలకు అందకుండా పోవడానికి కారణమైన అవకతవకలను సరిచేసి న్యాయం చేయాలి. తప్పు చేసిన వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆదివాసి రైతులను అనర్హులుగా చేయడం సరికాదు. దీన్ని పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ, బ్యాంకర్లతో ఉమ్మడి యంత్రాంగం ఏర్పాటు చేయాలి. ఏజెన్సి డీఎస్సీని ప్రకటించి, ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి. జీవో ఎంఎస్ నెం.3 పునరుద్ధరణ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయాలి.
యాభై శాతానికి పైగా ఆదివాసీ జనాభా ఉన్న, అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించి ఐదో షెడ్యుల్‌లో కలపాలి.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల అమలు ఆదివాసీ ప్రాంతాల నుండి అమలు చేయడానికి ప్రాధాన్యతనిచ్చి, ప్రారంభించాలి. అటవీశాఖ అభ్యంతరాల వల్ల పెండింగ్‌లో ఉన్న గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణం, మంచినీటి పథకాలు బోర్‌వోల్స్, త్రీపేస్ కరెంట్ సదుపాయాలు నిలిచిపోయినందున త్వరగా పరిష్కరించాలి. ఉట్నూర్, భద్రాచలం గిరిజన బీఎడ్ కళాశాలలతో సహా, అన్ని విద్యాసంస్థలో ఖాళీగా ఉన్న భోదన, భోదనేేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి.ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌కు చెందిన మన్ననూర్ ఐటీడీఏకు రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీవో)ను నియమించి పూర్తి స్థాయి ఐటీడీఏగా తీర్చిదిద్దాలి. పీవీటీజీ ఆదివాసి చెంచు తెగ పరిరక్షణ కోసం ప్రత్యేకమైన కృషి చేపట్టాలి. ఏజెన్సి ప్రాంతాల్లో నియోజక వర్గ కేంద్రాలుగా నర్సింగ్ కళాశాలలు, డిఎడ్ కళాశాలలు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు స్టడీ సర్కిల్స్, ఏర్పాటు చేయాలి.రాష్ట్రస్థాయిలో గిరిజన సలహామండలి టీఏసీ సమావేశాలు జిల్లా స్థాయిలో ఐటీడీఏ పాలక మండలిలోనూ నిర్వహించాలి. సమస్యల్ని ఎజెండాలుగా పెట్టి చర్చించాలి. ప్రతిసమావేశంలో వీటి అమలుకు సంబంధించి తీసుకున్న చర్యల నివేదిక (ఎటీఆర్) ఆధారంగా చర్చించాలి. గిరిజన సంక్షేమ శాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమించాలి. ఐటీడీఏలను బలోపేతం చేసి బడ్జెడ్‌లో అధిక నిధులు కేటాయించాలి.అన్నిరకాలుగా బలహీనమైపోయిన ఆదివాసీల సంక్షేమ అభివృద్ధికి పైన తెలిపిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చ చేపట్టాలి. ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. లేనిపక్షంలో ప్రజాపోరాటాలతోనే ప్రభుత్వానికి బుద్ధి చెపుతాం.
పూసం సచిన్
6281128872