పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. పుట్టడం ఎంత సహజమో మరణమూ అంతే సహజం. పుట్టడం, గిట్టడం మన చేతుల్లో లేదు. అయితే రెండింటి మధ్య జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ‘నా చావు పుట్టుకలు తప్ప నా బతుకంతా తెలంగాణకే అర్పితం’ అన్నారు ప్రజాకవి కాళోజి. ఇలా తమ బతుకును సమాజం కోసం అర్పించిన వారు ఎందరుంటారు? ఈ భూమిపై ప్రతిరోజూ ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. చరిత్రను సృష్టించేది మాత్రం కొందరే. చావు, పుట్టుకల మధ్య వారు గడిపిన జీవితమే దాన్ని నిర్ణయిస్తుంది.
‘మరణం నా చివరి చరణం కాదు.. మౌనం నా చితాభస్మం కాదు.. మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు’ అని ప్రముఖ కవి అలిశెట్టి అన్నట్టు తమ జీవితమంతా సమాజం కోసం అర్పించిన వీరులకు మరణం ఉండదు. కనుకనే అలిశెట్టిని ఇంకా మనం తలచుకుంటున్నాం. 93 ఏండ్ల కిందట మరణించినా భగత్‌సింగ్ ఇంకా మన అందరి గుండెల్లో చిరంజీవిగానే ఉన్నాడు. దేశ బానిస సంకెళ్లను తెంచేందుకు ఉరికొయ్యలను సైతం చిరునవ్వుతో ముద్దాడాడు. ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశాడు. ‘నా మరణం యువతకు స్ఫూర్తిదాయకం కావాలి’ అని అభిలషించాడు. మరణించినా యువతలో స్వాతంత్య్ర కాంక్ష పురిగొలిపాడు. మరణం లేని ఆ విప్లవ వీరుని స్వరం ఇంకా మన చెవుల్లో మారుమోగుతూనే ఉంది.
మహాత్మాగాంధీ, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, పుచ్చలపల్లి సుందరయ్య, దొడ్డి కొమరయ్య, వీరనారి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం… ఇలా ఎందరో వీరులు దేశం కోసం, అణగారిన ప్రజల కోసం, సమసమాజం కోసం అహర్నిశలూ శ్రమించారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన యోధుల జీవితాలన్నీ ఓ చరిత్రను సృష్టించాయి. తుది వరకూ తమ జీవితాన్ని అణగారిన వారికి అర్పించి ప్రాణాలు విడిచారు. ఇలాంటి మహనీయుల మరణం నేటి తరానికే కాక భావి తరానికి సైతం స్ఫూర్తిదాయకం. వారు కోరిక సమసమాజ స్థాపన ఓ కర్తవ్యంగా మన ముందు నిలిపారు.
ఆ అమరుల చెంతన ఇప్పుడు మరో అరుణతారై వెలిగాడు సీతారాం ఏచూరి. మన లక్ష్యం దిశగా అందరి గుండెల్లో నిలిచాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడం కోసం అనుక్షణం తపించిన గొప్ప వ్యక్తి. సత్యం కోసం నిత్యం పోరాడమని ప్రోది చేసిన చైతన్య వంతుడు. తన మేధనంతా సమాజ మార్పుకై ధారపోసిన మార్స్కిస్టు మేధావి. ఈతరం కమ్యూనిజానికి ఓ దిక్సూచి. ఆయన పోరాట పఠిమ మనకో స్ఫూర్తిదాయకం. మతం పేరుతో మారణహోమాలు సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో వీరి స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయడం మనందరి కర్తవ్యం. భగత్ సింగ్ కోరిన సంపూర్ణ స్వాతంత్య్రం, గాంధీ కోరిన స్త్రీ సమానత్వం, అంబేద్కర్ అడిగిన సమాజం, సుందరయ్య కలలు కన్న దేశం ఇంకా సిద్ధించలేదు. వారి ఆశయ సాధనలో నడిచిన విప్లవ వీరుడు ఏచూరి. వారి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు కొనసాగించడమే మనందరి కర్తవ్యం. ఆ మహనీయులకు మనమిచ్చే నిజమైన నివాళి.