దివంగత ఇంజినీర్లకు నివాళులు

దివంగత ఇంజినీర్లకు నివాళులునవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్‌
నవాబ్‌ అలి నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ వర్ధంతిని బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినంగా నిర్వహించారు. డిసెంబరు ఏడు, 2022 నుంచి డిసెంబర్‌ ఐదు 2023 వరకు చనిపోయిన అన్ని శాఖల ఇంజినీర్లకు నివాళులు అర్పించారు. ఈ ఏడాది సాగునీటి శాఖలో 24 మంది, పంచాయతీ రాజ్‌ శాఖలో 10 మంది, విద్యుత్‌ శాఖలో ఏనిమిది మంది, రోడ్డు భవనాల శాఖలో ఏడుగురు, పబ్లిక్‌ హెల్త్‌ శాఖలో ముగ్గురు, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌లో ఇద్దరు, ఇతర ఇంజనీరింగ్‌ శాఖలలో ఏనిమిది మొత్తం 62 మంది వివిధ హౌదాల్లో పనిచేసిన ఇంజినీర్లు మృతిచెందారనీ, ఇందులో 17 మంది ఇంజినీర్ల సర్వీస్‌లో ఉండగానే చనిపోయారని సీనియర్‌ విశ్రాంత ఇంజినీర్‌ రాంరెడ్డి చెప్పారు. వారందరికీ పేరుపేరునా పూలు సమర్పించి వారి ఫోటోల ముందు కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. వారితో పాటు భారత రాజ్యాంగ రచన చేసిన భారత రత్న డా. బాబా సాహెబ్‌ బి ఆర్‌ అంబేద్కర్‌కు, భారత వ్యవసాయ విప్లవానికి సారధ్యం వహించిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్‌ స్వామినాథన్‌కూ ఈ సందర్భంగా నివాళి అర్పించడం జరిగింది. చనిపోయిన ఇంజినీర్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక నిమిషం మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాగునీటి శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ లు సి మురళీధర్‌, బి అనిల్‌ కుమార్‌, ఎన్‌ వెంకటేశ్వర్లు, చీఫ్‌ ఇంజినీర్లు అనిత, చంద్రశేఖర్‌, మోహన్‌ కుమార్‌, ఎస్‌ఈ శ్రీనివాస్‌, శ్రీధర్‌రావు దేశ్‌పాండే కోటేశ్వరరావు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఇంజినీర్ల తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు శ్యాం ప్రసాద్‌ రెడ్డి, పూర్వ అధ్యక్షులు చంద్రమౌళి, సీనియర్‌ ఇంజినీర్లు రాంరెడ్డి, గణపతిరావు, హనుమంత రావు, దామోదర్‌ రెడ్డి, ముత్యంరెడ్డి, రాజనరసయ్య, జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.