తెలంగాణ తల్లులు ఎలాంటి బిడ్డల్ని కన్నారో
ఈ మట్టి గర్వించతగ్గ తల్లులే వాళ్లు
గాయాల తెలంగాణకు కట్టుకట్టిన తల్లులు
ఆ తల్లులు చరిత్రలో తమ పేర్లను కోరుకోలే
తమ త్యాగాలను చాటుకోని పావెల్ అమ్మలు
ఉద్యమాలకు బువ్వపెట్టిన తల్లులు
బిడ్డల్ని వీరుల్ని చేరిన తల్లుల చరిత్ర
తెలంగాణ గౌరమ్మా-
నువు తెలంగాణ బతుకమ్మవే కాదు
అత్యంత వెనుకబడిన సంచార, అర్ధ సంచార
విముక్త జాతుల విముక్తి
కొడుకునిచ్చిన తల్లివమ్మా
ఊర్లో అంటరానితనాన్ని అనుభవించే వారిని
అక్కున చేర్చుకుని అండగ నిలిచే
తిరుమలినిచ్చినవమ్మా
తిరుపతికి పోలేనోళ్ళకు
జీళ్ళ చేరువే పేద జీవులకు దిక్కు
బడుగులకు కొండంత అండనిచ్చే
తిరుమలినే ఇచ్చినవుకద గౌరమ్మా
కులవిముక్తి పాఠాన్ని చెప్పే బిడ్డనిచ్చిన తల్లివే
అనంతారం నుంచి అనంతానికి వెళ్ళినవా గౌరమ్మా
(ఢిల్లీ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమల్లి తల్లి గౌరమ్మ మరణవార్త విని)
– జూలూరు గౌరీశంకర్