
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు సత్యనారాయణ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. గ్రామ పంచాయితీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, మండల విద్యాధికారి ఆంధ్రయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా మాలి దశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ గౌడ్ ను ఘనంగా సన్మానించి మెమొంటోను అందజేశారు. అనంతరం ఆంధ్రయ్య మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు తొలి మాలి దశ ఉద్యమాలలో అనేక మంది పోరాడి నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని ఎంతోమంది యువత ప్రాణ త్యాగాలు చేయడం ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సత్యనారాయణ గౌడ్ మళ్లీ దశ తెలంగాణ సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా అనేక సందర్భాల్లో జైల్లోకి వెళ్లడం, నిర్బంధాన్ని ప్రతిఘటించి నిరాహారదీక్ష కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగించారన్నారు. రాస్తారోకో, వంట వార్పు హైదరాబాదులో జరిగిన మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, సడక్ బంద్ కార్యక్రమాలకు సత్యనారాయణ గౌడ్ నాయకత్వం వహించాడని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్న 10 సంవత్సరాల కాలంలో కూడా ప్రజల కోరికలు సాధించబడలేదన్నారు.ఇంటికొక ఉద్యోగం, మూడు ఎకరాల భూమి సాధించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాధించడానికి మరో పోరాటం అవసరమని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిటికేసి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు రేవతి గంగాధర్, పడిగేల ప్రవీణ్, గోపిడి లింగారెడ్డి, మోహన్ నాయక్, గ్రామ కమిటీ సెక్రెటరీ శ్రావణ్, ఉపాధ్యక్షులు రాజుల బాబయ్య, సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.