ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలోని న్యూమూన్ స్కూల్లో కార్గిల్ దివాస్ పురస్కరించుకొని విద్యార్థులు సైనికుల వేషధారణలో జాతీయ పతాకాలతో 100 అడుగుల జాతీయ జెండాని ప్రదర్శించి అమరవీరులకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అమర జవాన్లను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు ఉప్పరి బాలరాజు మాట్లాడుతూ..1999లో జమ్ముకాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ రక్కసి మూకలు అక్రమంగా చొరబడి కాశ్మీర్ ను ఆక్రమించాలనే దురాలోచనను మన భారత జవానులు తిప్పికొట్టారు. ఎత్తైన పర్వత శిఖరాలలో ఉన్న పాక్ సైన్యాన్ని మట్టుబెట్టి మూడు నెలలు వీరోచితంగా పోరాడి జూలై 26 న టైగర్ హిల్స్ వద్ద మనభారతీయ జాతీయ జెండాను ఏగరవేసి విజయకేతనం చూపారు. దీనితో యుద్దం ముగిసింది. కానీ ఈ యుద్దంలో 527 మంది భారత జవానులు వీర మరణం పొందారు. అలాంటి అమరవీరులను మరో సారి స్మరించుకోవాలసిన అవసరం ఎంతో ఉందని అందుకే జులై 26న కార్గిల్ దివాన్ కార్యక్రమాన్ని భారతీయులందరు ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఆయన విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూమూన్ స్కూల్ కరస్పాండెంట్ నజీమా అజిమోద్దిన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.