– 2028 ఒలింపిక్స్ జాబితాలో దక్కని చోటు
– తుది నిర్ణయానికి మరింత సమయం
నవతెలంగాణ-ముంబయి
అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఉన్నతాధికారుల నడుమ వివాదం ‘బాక్సర్ల’పై పడింది. రష్యాకు చెందిన ఉమర్ క్రెమ్లోవ్ అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉమర్ ఐబీఏను నడిపిస్తున్న తీరు, పరిపాలన, ఆర్థిక లావాదేవీలు సహా పారదర్శక టోర్నీల నిర్వహణ పట్ల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఐఓసీ సూచనలు బేఖాతరు చేస్తూ ఉమర్ సైతం ఏకపక్షంగానే దూసుకెళ్తున్నారు. ఇటు ఐఓసీ ఉన్నతాధికారులు సైతం ఆటను పక్కనపెట్టి.. ఉమర్‌ను దారికితీసుకొచ్చే దారులను వెతుకుతున్నారు. అందులో భాగంగానే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ క్రీడల జాబితాలో బాక్సింగ్‌కు చోటు దక్కలేదు. సోమవారం ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ఐఓసీ సెషన్ ముగియగా.. 2028 లాస్ ఏంజిల్స్ క్రీడల జాబితాకు ఇక్కడ ఆమోదం లభించింది. అయితే, 1920 నుంచి ఒలింపిక్స్‌లో రెగ్యులర్ క్రీడగా కొనసాగుతున్న బాక్సింగ్‌కు చోటు లభించలేదు. బాక్సింగ్‌ను ‘హోల్డ్‌లో ఉంచినట్టు’ ఐఓసీ అధికారి ప్రతినిధి వెల్లడించారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌కు చోటు దక్కింది. కానీ ఒలింపిక్స్‌కు బాక్సర్లను ఐబీఏ నిర్వహించిన టోర్నీల నుంచి ఎంపిక చేయటం లేదు. ఐఓసీ యంత్రాంగం ప్రత్యేకంగా ఎంపిక చేసిన టోర్నీలు, నిర్వహించిన టోర్నీల ద్వారా బాక్సర్లను పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపిక చేస్తున్నారు. ‘లాస్ ఏంజిల్స్ 2028 స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించి బాక్సింగ్‌పై నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టాం. దీనిపై ఐఓసీ సెషన్లో ఎటువంటి చర్చ జరుగలేదు. ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌కు గొప్ప చరిత్ర ఉంది. అమెరికాకు దిగ్గజ బాక్సర్ల వారసత్వం ఉంది. 2028 ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ను చూసేందుకు ఐఓసీ, అమెరికా ఇష్టపడతాయి. ఐఓసీకి బాక్సింగ్‌తో, బాక్సర్లతో ఎటువంటి సమస్య లేదు. బాక్సింగ్ సమాఖ్యను నడిపిస్తున్న గవర్నింగ్ బాడీతోనే సమస్య ఎదుర్కొంటున్నాం. మరో బాక్సింగ్ సమాఖ్యకు ఐఓసీ గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కాలం సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నామని’ లాస్ ఏంజిల్స్ 2028 చైర్మెన్ కాసీ వాసెర్మాన్ తెలిపారు.
లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్‌కు చోటు
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌లో క్రికెట్‌కు అధికారికంగా చోటు లభించింది. సోమవారం ముంబయిలో సమావేశమైన ఐఓసీ సెషన్ లాస్ ఏంజిల్స్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌కు ఆమోద ముద్ర వేసింది. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్‌లకు క్రీడల జాబితాలో చోటు దక్కింది. 2028 ఆతిథ్య నగరం సిఫారసుల మేరకు ఈ ఐదు క్రీడలను జాబితాలో చేర్చారు. ఈ అంశంలో ఓటింగ్ నిర్వహించగా ఇద్దరు వ్యతిరేకంగా, మిగతా సభ్యులు అనుకూలంగా ఓటేశారు. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో టీ20 ఫార్మాట్లో ఆరు జట్లతో కూడిన టోర్నీని ఐసీసీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కటంపై ఐసీసీ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది.