– అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం
– పోడియం వద్దకు ఎంఐఎం
– వత్తాసుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
– రేవంత్, అక్భరుద్ధీన్ పరస్పర విమర్శలు
– నేరుగా నాతోనే మాట్లాడాలి : స్పీకర్ వార్నింగ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వెల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విద్యుత్ బకాయిలకు సంబంధించిన ట్రాన్స్‌కో నివేదికపై గురువారం నాడు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. అయితే ఈ నివేదిక నేపథ్యంలో సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభ సాంతం హాట్ హాట్‌గా సాగింది. మధ్యాహ్నాం మూడు గంటల నుంచి ఐదున్నర వరకు అధికార, ప్రతిపక్షాల మధ్య వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు డి. శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్ జోక్యం చేసుకున్నారు. మధ్య, మధ్యలో స్పీకర్ మైక్ కట్ చేశారు. సీఎం, మంత్రులు మాట్లాడుతున్న క్రమంలో ఎంఐఎం సభ్యులు తమకు సమయం కేటాయించాలంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. రెండుసార్లు ఈ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంఐఎంకు బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు వత్తాసు పలికారు. వీరూ పోడియం వద్దకు వెళ్లారు. ఇదిలా జరుగుతుండగానే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…” బకాయిలు చెల్లించని ప్రాంతాల్లో మొదటి స్థానంలో సిద్దిపేట 61.37 శాతం, రెండో స్థానంలో గజ్వేల్ 50.29 శాతం, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43 శాతం ఉన్నాయి. సిద్దిపేటలో ఎమ్మెల్మే హరీశ్‌రావు.. గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్ సౌత్‌లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలి. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్టు జగదీష్‌రెడ్డి మాట్లాడారు. రైతులు రోడ్డెక్కారా అని జగదీష్‌రెడ్డి అడిగారు. కామారెడ్డిలో సెప్టెంబర్ ఒకటిన సబ్ స్టేషన్లు ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన సంగతి జగదీష్‌రెడ్డికి గుర్తుచేస్తున్నాను” అని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. దేశానికి మైనార్టీ నేతను రాష్ట్రపతిని చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ మాత్రమే. 12 శాతం రిజర్వషన్లను కల్పిస్తానని బీఆర్‌ఎస్ మైనార్టీలను మోసం చేసింది. మైనార్టీలకు న్యాయం చేసే వాళ్లతో ఉంటారా? లేదా మోసం చేసే వాళ్లతో మజ్లిస్ నేతలు ఉంటారో.. తేల్చుకోవాలి” అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పాలనలో పంటలు ఎండిపోయాయి..
”బీఆర్‌ఎస్ పాలనలోనే సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో రైతులు రోడ్డెక్కింది. కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది. బీఆర్‌ఎస్ పాలనలోనే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుంది. కానీ ఆనాటి సీఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదు. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిది కాదు.. మైనార్టీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దిని శంకించాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం.. ఇప్పుడు విద్యుత్ రంగ శ్వేతపత్రంపై చర్చిద్దాం” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మీరు కేవలం ముస్లింలకు ప్రతినిధి కాదు..హిందువులకు కూడా.. మీరు కామారెడ్డిలో షబ్బీఆర్ అలీ, జూబ్లీహిల్స్‌లో అజారుద్దన్‌ను ఓడగొట్టారని చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం పనిచేసేవాళ్లతో ఉంటారా ? మోడీకి మద్దతు ఇస్తారా ? తేల్చుకోవాలని అన్నారు.
అక్భరుద్దీన్ ఆగ్రహం
కరెంటు శ్వేతపత్రంపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఏపీ నుంచి బకాయిలు వసూలు చేయాలని కోరారు. కేంద్ర సహకారం అడగాలని సూచించారు. పాతబస్తీలోని విద్యుత్ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో మీరు పనులు చేయించుకోలేదా ? అని ప్రశ్నించారు. లెక్చర్లు ఎందుకు ఇస్తున్నారు అంటూ మాట్లాడారు. దీనికి అక్భరుద్ధీన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘పిల్లలు కొత్తగా వచ్చారు…మాట్లాడటం నేర్చుకోవాలి.. నేర్చుకుంటారు’ అని చెప్పారు. సత్యనారాయణ మరోసారి మాట్లాడే ప్రయత్నం చేయగా ఎంఐఎం సభ్యులు నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీరికి బీఆర్‌ఎస్ సభ్యులు తోడయ్యారు. అలాగే సత్యనారాయణకు మద్ధతుగా కాంగ్రెస్ సభ్యులు లేచి మద్దతిచ్చారు. చిలికి చిలికి గాలివానగా మారి చివరకది హిందూ-ముస్లిం చర్చవరకు వెళ్లింది. ఇరుపక్షాల ఎమ్మెల్యేలూ వాగ్వాదానికి దిగారు. సెటైర్లతో కామెంట్లు చేసుకున్నారు. చివరకు అక్భరుద్ధీన్ మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వ దృష్టికిపోవద్దా అని ప్రశ్నించారు. పాతబస్తీకి సంబంధించి కొన్ని సమస్యలు పరిష్కరించారనీ, ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించమని ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది కదా అన్నారు. మేము బీజేపీకి బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. బాబ్రీ మజీద్‌ను కూలగొట్టిన వాళ్లకు, ముస్లింల రక్తంతో హోలీ ఆడేవాళ్లతో కలిసి ఎలా ఉంటామని ప్రశ్నించారు. ఒకానొక సందర్భంగా మైక్ కట్‌చేశారంటూ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు.
నేరుగా నాతో మాట్లాడండి:స్పీకర్
అక్భరుద్ధీన్ నేరుగా సీఎంను ఉద్దేశించి మాట్లాడటంతో స్పీకర్ గడ్డం వినోద్‌కుమార్ స్పందిస్తూ ‘మీరు సీనియర్ శాసనసభ్యులు..నేరుగా నాతో మాట్లాడాలి. సీఎంతో కాదు. సభా నాయకుడు మాట్లాడే సందర్భంలో ఇబ్బంది పెట్టొద్దు’ అని అన్నారు. అలాగే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, కేటీఆర్‌లకు కూడా ఇలాంటి సూచన చేశారు.
కాంగ్రెస్, టీడీపీతో అందుకే పొత్తు పెట్టుకున్నాం: హరీశ్‌రావు
కాగా…. సీఎం రేవంత్‌రెడ్డి లెవనెత్తిన ప్రశ్నలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సమాధానమిస్తూ.. ”సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీలో గెలువలేదని సీఎం అక్కసు వెళ్లగక్కారు. సిద్దిపేటలో బిల్లులు బకాయి ఉంటే వసూలు చేయండి. కానీ ప్రజలను అవమానించకండి. మేము కాంగ్రెస్‌తోనైనా, టీడీపీతోనైనా తెలంగాణ కోసమే పొత్తు పెట్టుకున్నాం” అని ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు.
శ్వేతపత్రంలో ఆ విషయం చెప్పారు : కేటీఆర్
అయితే… సీఎం రేవంత్‌రెడ్డి లెవనెత్తిన ప్రశ్నలకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమాధానమిస్తూ.. ”2014వరకు 6గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారు. శ్వేతపత్రంలో ప్రభుత్వమే ఈ విషయం చెప్పింది.11 సార్లు కాంగ్రెస్‌ని గెలిపిస్తే వారి అసమర్థతను బయట పెట్టుకున్నారు. నేదునూరు, శంకర్‌పల్లికి గ్యాస్ కేటాయించలేదు కాబట్టే అవి మేము వదిలేశాం సీఎం మా మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు” అని కేటీఆర్ చెప్పారు. కాగా.. సభలో కేటీఆర్ మాట్లాడుతుండగా స్పీకర్ గడ్డం వినోద్‌కుమార్ మైక్ కట్ చేశారు.
బాబ్రీ మసీదు అంశం సభలో తేవద్దు : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
కాగా… ఎంఐఎం నేతలు లెవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సమాధానమిస్తూ.. ”ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బాబ్రీ మసీదుపై పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అనవసరంగా బాబ్రీ మసీదు అంశం సభలో తేవద్దు” అని అభిప్రాయపడ్డారు.