ఎన్నికల కోడ్‌ లోపే టీఆర్టీ నోటిఫికేషన్‌ జారీ చేయాలి

– సబితమ్మా.. మీ హామీ ఎక్కడ.. టీఆర్టీ ఇంకెప్పుడూ..:
– తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్‌ నీల వెంకటేష్‌
– విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన అభ్యర్థులు
నవతెలంగాణ- హిమాయత్‌నగర్‌
సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు 15 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి టీఆర్టీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్‌ నీల వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర డిఎడ్‌, బిఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్‌ రావు, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్‌ నీల వెంకటేష్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం బీఈడీ, డీఈడీ అభ్యర్థులు, టీచర్స్‌, జేఏసీ నాయకులు హైదరాబాద్‌ సైఫాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని పెద్దఎత్తున ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులకు, అభ్యర్థులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురు అభ్యర్థులు, జేఏసీ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నీల వెంకటేష్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం 15 వేల ఉపాధ్యాయ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీ మేరకు టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇంకెప్పుడు జారీ చేస్తారన్నారు. టీఆర్టీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి ఎన్నికల కోడ్‌ లోపే టీఆర్టీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. టెట్‌తో పాటు టీఆర్టీ షెడ్యూల్‌ విడుదల చేయాలని, టెట్‌తో కాలయాపన చేయకుండా టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ అంటూ టీఆర్టీకి ముడిపెట్టొద్దన్నారు. 4 లక్షల మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో విద్య ప్రమాణాలను మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ వేయకుండా.. 7 ఏండ్ల నుంచి టీచర్ల పోస్టులను భర్తీ చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 24 వేల డీఎస్సీ టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2 వేలు, కస్తూర్బా పాఠశాలల్లో 1,500 టీచర్‌ పోస్టులు, 4 వేల కంప్యూటర్‌ టీచర్‌ పోస్టులు, 10 వేల పీఈటి, 5 వేల ఆర్ట్స్‌ క్రాఫ్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ టీచర్‌ పోస్టులు, 3 వేల లైబ్రేరియన్‌, 4 వేల జూనియర్‌ అసిస్టెంట్‌, 10 వేల అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలో ఇంత పెద్ద మొత్తంలో టీచర్‌ పోస్టులను భర్తీ చేయకుండా విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ లోపే పలు శాఖల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని, లేకపోతే నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి పెద్దఎత్తున ప్రగతి భవన్‌, రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నేతలు మల్లేష్‌ యాదవ్‌, భాస్కర్‌ ప్రజాపతి, పలు జిల్లాల నుంచి బీఈడి, డీఈడి అభ్యర్థులు, టీచర్స్‌ పాల్గొన్నారు.