నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల తొలగింపు, గ్రేడింగ్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం కొనసాగించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వం చేసిన మార్పులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని కోరారు. పదో తరగతి సిలబస్ పూర్తికావస్తున్న సమయంలో విద్యా సంవత్సరం దాదాపు చివరలో ఉన్నపుడు పరీక్ష విధానాన్ని మార్చడం సరైంది కాదని తెలిపారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం, అందుకనుగుణంగానే రూపొందింపబడిన పాఠ్యపుస్తకాలు, విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి, తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు, విషయం నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి సంవత్సరం మార్పు చేర్పులతో అమలు చేయాలని కోరారు.