– ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్
నవతెలంగాణ- దౌల్తాబాద్ : సాటి మనిషి ఆపదలో ఉన్నాడని తెలిస్తే మనకు తోచిన సహాయం చేసి వారికి మనోధైర్యం కల్పించడమే నిజమైన మానవత్వం అంటారని ఎస్ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందు ప్రియాల్ గ్రామానికి చెందిన రాయపోల్ సత్తయ్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. ఆయన చికిత్స కోసమే కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రులలో చికిత్స అందించారు. అలాంటి నిరుపేద కుటుంబానికి చెందిన సత్తయ్య క్యాన్సర్ వ్యాధిని జయించలేక మృత్యువాత పడటం బాధాకరమన్నారు. సత్తయ్యకు భార్య భూమమ్మ, కుమారులు బాబు, మధు కూతురు మమత ఉన్నారు. మన సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడే ఆదుకొని వారికి కాస్త గుండె ధైర్యాన్ని కల్పిస్తేనే నిజమైన మానవత్వం అనిపిస్తుంది. కాబట్టి ఎస్ఆర్ ఫౌండేషన్ తరపునా వారి కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా మానవతావాదులు వీరి కుటుంబానికి మీకు తోచిన సహాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూరంపల్లి ప్రవీణ్, రాయపోల్ శ్రీను, గొడుగు పల్లి మల్లేశం, బాలమల్లయ్య, కనకవ్వ, చంద్రవ్వ, రవి తదితరులు పాల్గొన్నారు.