– అమెరికా కోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై 2020 అధ్యక్ష ఎన్నికను మార్చటానికి ప్రయత్నిం చాడనే ఆరోపణకు సంబంధించి ఆయనకు అధ్యక్షుడికి లభించే ఎటువంటి చట్టపరమైన రక్షణ ఉండదని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలోని ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ మంగళవారం ఒక రూలింగ్ ఇచ్చింది. ఈ కేసును స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ తీసుకుని వచ్చాడు. ట్రంప్‌పై ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయటానికి ప్రయత్నించాడనే ఆరోపణకు సంబం ధించి నాలుగు నేరాలను స్మిత్ మోపాడు. వీటిలో అమెరికాను మోసం చేయటం, అధికార ప్రకటనను ఆపటానికి 2021 జనవరి 6వ తేదీనాడు అమెరికా రాజధానిపై హింసాత్మకంగా అల్లర్లు చేయించటం ఉన్నాయి.అమెరికా 45వ అధ్యక్షుడైన ట్రంప్ తాను ఎటువంటి నేరం చేయలేదని, మోపబడిన అభియోగాలు జరిగిన కాలంలో తాను అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున తనకు అధ్యక్షుడికివుండే నేర విచారణ నుంచి రక్షణ ఉంటుందని వాదించాడు. అయితే ఈ నేరానికి సంబంధించి మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఒక సాధారణ పౌరుడిగా మాత్రమే ఉంటాడని, ఆయనకు ఒక నేరస్థుడికి ఉండే రక్షణలు మాత్రమే ఉంటాయని ముగ్గురు జడ్జీల ప్యానల్ రూలింగ్ ఇచ్చింది. ఆయన అధక్షుడిగా వున్నప్పుడు కార్యనిర్వాహక రక్షణలు ఉండి వుంటాయని, ప్రస్తుత విచారణలో ఆయనకు ఎటువంటి రక్షణలు ఉండవని ప్యానల్ పేర్కొంది. ప్యానల్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు జె. మిచెల్ చైల్డ్స్, ఫ్లోరెన్స్ పాన్‌లను డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షడు జో బైడెన్ నియమించాడు. మూడవ న్యాయమూర్తి కారెన్ లి క్రాప్ట్ హెండర్‌సన్ ను జార్జి డబ్యు బుష్ నియమించాడు.
ఒక అధ్యక్షుడిని తాను అధికారంలో వున్నప్పుడు తీసుకున్న అధికారిక చర్యలపై విచారించటం రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమౌతుందని, అది అమెరికా ప్రజాస్వామ్యానికి పునాదివంటిదని కోర్టు రూలింగ్ వెలువడిన తరువాత ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చెవుంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. డీసీ సర్క్యూట్ కోర్టు నిర్ణయంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సవినయంగా విబేధిస్తున్నాడని, అధ్యక్షత్వాన్ని, రాజ్యాంగాన్ని రక్షించటం కోసం పైకోర్టుకు అప్పీల్ చేస్తాడని ఆయన ప్రకటించాడు. ఈ రూలింగ్‌ను ఫుల్ డీసీ సర్క్యూట్‌కు గానీ, నేరుగా సుప్రీంకోర్టుకు గానీ ట్రంప్ అప్పీల్‌కు వెళ్ళొచ్చు. 2020లో అమెరికాలోని అనేక రాష్ట్రాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా మెయిల్ ద్వారా ఓటు వేయటానికి ఎన్నికల నిబంధనలను మార్చాయి. అంతిమంగా అమెరికా చరిత్రలోనే అత్యధికంగా బైడెన్ 8 కోట్ల ఓట్లతో ట్రంప్‌ను ఓడించాడు. ఈ ఎన్నికలో రిగ్గింగ్ జరగటమే కాకుండా అనేక అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపించాడు. ఈ ఆరోపణను డెమోక్రాట్లు, అమెరికా మీడియా తిరస్కరించటం జరిగింది.