బుల్డోజర్‌ బాటలో ట్రంప్‌!

Trump in the path of the bulldozer!కాపురం చేసే కళ కాలు తొక్కినపుడే తెలుస్తుందన్న సామెత తెలిసిందే. అదే జరిగింది. డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైతే అతగాడి ఫాసిస్టు అజెండాను అమలు చేస్తాడని భయపడిందంతా గద్దెనెక్కక ముందే వాస్తవ రూపం దాలుస్తోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ విజయం సంపూర్ణమైంది. ఇప్పటికే అధ్యక్ష స్థానం, సెనెట్‌ను వశం చేసుకున్న ఆ పార్టీ పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో కూడా మెజారిటీ సాధించింది. ఇది రాస్తున్న సమయానికి ఇంకా తొమ్మిది సీట్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా 435కు గాను రిపబ్లికన్లకు సభలో కావాల్సిన మెజారిటీ 218 స్థానాల్లో విజయం లేదా ముందంజలో ఉన్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. పోస్టు ద్వారా వచ్చే ఓట్లకు ఎన్నికలు ముగిసిన తరువాత వారం రోజుల గడువు ఉండటంతో మెల్లగా వస్తున్న వాటి లెక్కింపు కొనసాగుతోంది. గురువారం నాటికి మొత్తం పోలైన వాటిలో 97శాతం లెక్కింపు జరిగింది. ఇప్పటికే మెజారిటీలను బట్టి ఆ ఓట్లు ఎటు పడినా ఫలితాలు మారే అవకాశం లేదన్న అంచనాతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేది దాదాపుగా తేలినట్లే. మరో రెండేండ్లకు జరిగే మధ్యంతర ఎన్నికల్లో వచ్చే సీట్లను బట్టి పార్లమెంటులో మెజారిటీలు మారవచ్చు, కొనసాగ వచ్చు. అప్పటి వరకు డోనాల్డ్‌ ట్రంప్‌ తన బుల్డోజర్‌ అజెండాను అమలు జరిపేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఉభయ సభల్లో మెజారిటీలు తక్కువగా ఉన్నందున కొన్ని సందర్భాలలో అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం కోసం ప్రతిపక్ష డెమోక్రాట్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. జో బైడెన్‌కు కాంగ్రెస్‌లో మెజారిటీ లేకున్నా 2022 నుంచి రిపబ్లికన్ల మద్దతుతో ముందుకు సాగిన తీరును చూస్తే ట్రంప్‌ కూడా అదే బాటలో నడుస్తాడు.
ఇంకా అధికారాన్ని లాంఛన ప్రాయంగా స్వీకరించక ముందే ట్రంప్‌ తన యంత్రాంగాన్ని ఎంచుకోవటం ప్రారంభించాడు. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ఒక సలహాదారు. అతగాడి దగ్గర నుంచి పచ్చిమితవాదుల వరకు ఎన్నికలలో తన కోసం పనిచేసిన వారిని లేదా తెర వెనుక ఉండి సహకరిం చిన వారి ప్రతినిధులను, తన అజెండాను నిర్ధాక్షిణ్యంగా సమర్ధించే, ముందుకు తీసుకుపోయేవారిని, తన కనుసన్నలలో తీర్పులను ఇచ్చే న్యాయమూర్తులను ఎంచుకున్నాడు. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ఫిరాయించిన తులసీ గబ్బార్డ్‌ను నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ డైరెక్టర్‌గా నియమించాడు. కొందరు పార్లమెంటు సభ్యులను కూడా ఎంచుకున్నందున కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అధికారానికి వచ్చిన వందరోజుల్లో ఏమి చేయనుందీ ట్రంప్‌ ముందుగానే సూచనప్రాయంగా వెల్లడించాడు. ముస్లింల మీద నిషేధం, అక్రమంగా ప్రవేశించిన లక్షలాది మంది విదేశీయులను సామూహికంగా బయటకు పంపటం, తన ఆదేశాల మేరకు 2021 జనవరి ఆరున అమెరికా అధికార కేంద్రం కాపిటోల్‌పై దాడిచేసిన వారిమీద ఉన్న కేసుల ఎత్తివేతకు క్షమాభిక్ష ప్రకటన, బైడెన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యావరణ విధానాల రద్దు వంటివి వాటిలో ఉన్నాయి. అధికార యంత్రాంగ నియామకాల తీరుతెన్నులను చూసిన తరువాత అతగాడి ఫాసిస్టు అజెండాను అమలు జరపటం ఖాయమనే భయాందోళనలు ప్రారంభమయ్యాయి.
ఆయుధ పరిశ్రమల ప్రయోజనాల కోసం పనిచేసే ఫాక్స్‌న్యూస్‌ జర్నలిస్టు పీట్‌ హెగ్‌సేత్‌ను రక్షణశాఖ మంత్రిగా నియమించిన తీరు ఆ శాఖ యంత్రాంగాన్నే నివ్వెరపరిచినట్లు వార్తలు. దాడులలో మహిళలను నియమించకూడదని, యుద్ధ నేరాలకు పాల్పడిన వారిని క్షమించివేయటం వంటి పచ్చి మితవాద వైఖరులను పీట్‌ కలిగి ఉన్నాడు. తన టీవీ కార్యక్రమాలలో ట్రంప్‌ను అడ్డగోలుగా సమర్ధించాడు. పాలస్తీనానా, వెస్ట్‌ బాంకా అదెక్కడుంది అంటూ గుడ్డిగా వ్యతిరేకించిన ”తీవ్రవాది” అర్కాన్సాస్‌ మాజీ గవర్నర్‌ మైక్‌ హక్‌బీని ఇజ్రాయిల్‌లో అమెరికా రాయబారిగా ఎంపిక చేయటాన్ని బట్టి రానున్న రోజుల్లో పశ్చిమాసియాలో చిచ్చు కొనసాగించేందుకే ట్రంప్‌ నిర్ణయించుకున్నట్లు తేటతెల్లమైంది. అందుకే ఇజ్రాయిల్‌ నాయకత్వం ట్రంప్‌ విజయోత్సవాలు జరుపుకుంటోంది. పాలస్తీనా నిర్వాసితులకు సాయం చేసే ఐరాస సహాయ సంస్థకు నిధులివ్వకూడదని వాదించే మహిళ ఎల్సీ స్టెఫానిక్‌ను ఐరాస రాయబారిగా ఎంచుకున్నాడు. ట్రంపే ఒక పిచ్చివాడు అనుకుంటే అలాంటి వాడి కొలువులో చేరినవారు ఎలాంటి ఉన్మాదచర్యలకు పాల్పడతారో తెలియదు. అమెరికా ఎన్నికలు అక్కడి కార్మికవర్గాన్ని,యావత్‌ ప్రపంచాన్నే ముప్పు ముంగిటకు చేర్చాయంటే అతిశయోక్తి కాదు.