ట్రంప్‌ బెదిరింపు!

 Sampadakiyamఅమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మనదేశాన్ని బెదిరించాడు. తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే ఏ దేశమైనా వాటి మీద పన్నులు విధిస్తే తాము కూడా దెబ్బకు దెబ్బతీస్తామని అలాంటి దేశాలలో భారత్‌ కూడా ఉందని ట్రంప్‌ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు చైనాపై వాణిజ్యపోరును ప్రారంభించటమే కాదు, మన దేశం నుంచి చేసుకొనే దిగుమతులపై ప్రాధాన్యత వ్యవస్థ విధానం(జిఎస్‌పి)లో భాగంగా ఇస్తున్న రాయితీలను కూడా రద్దు చేసిన పెద్దమనిషి ట్రంప్‌. మనదేశాన్ని తమ వలలోకి లాక్కొనేందుకు అంతకు ముందు అమెరికా విసిరిన బిస్కెట్‌ వంటిది ఆ రాయితీ. ట్రంప్‌ చర్యకు ప్రతిగా మనం కూడా అమెరికా ఉత్పత్తులపై పన్ను విధింపుకు పూనుకున్నాం. వాటి మీద ప్రపంచ వాణిజ్య సంస్థలో పరస్పరం మూడేసి కేసులు దాఖలు చేశారు. వాటిని పరిష్కరించుకోవాలని కొద్ది నెలల క్రితం ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. ఆ స్పూర్తిని దెబ్బతీసేందుకు ట్రంప్‌ పూనుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం అమెరికా నుంచి మనం చేసుకొనే దిగుమతుల కంటే మన ఎగుమతులే ఎక్కువగా ఉండి వాణిజ్య మిగులులో ఉన్నాం. దాన్ని పూడ్చేందుకు తమ వస్తువులను కొనుగోలు చేయాలని లేకుంటే వాణిజ్యపోరుకు దిగుతానని హెచ్చరించటమే ట్రంప్‌ మాటల అంతరార్ధం. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటమనే పదం ఎంతో ముఖ్యం. వారు ఒక సైకిలు పంపితే మేము మరో సైకిలు పంపుతాం. వారు గనుక వంద లేదా రెండువందల శాతం పన్ను విధిస్తే మేమూ అదే చేస్తాం. చైనా, బ్రెజిల్‌, భారత్‌ వంటి దేశాలు అలా చేస్తున్నాయన్నాడు. వారు మార్చుకుంటే మంచిది లేకుంటే మేమూ అదే చేస్తాం అన్నాడు.ప్రపంచ వాణిజ్య సంస్థ సమాచారం ప్రకారం 2023లో రక్షణ చర్యల్లో భాగంగా తృణధాన్యాలపై 193శాతం, పాల ఉత్పత్తుల మీద 188, ఖనిజాలు,లోహాలపై 187, నూనెగింజలు, ఖాద్యతైలాలపై 164, పానీయాలు, పొగాకుపై 150, పండ్లు, కూరగాయలపౖౖె 132, రసాయనాలపై 56, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలపై 53, చేపలు, వాటి ఉత్పత్తులపై 35శాతాల చొప్పున అమెరికా దిగుమతి పన్ను విధిస్తున్నది. దాని నిర్వాకం ఇలా ఉంటే ఇతర దేశాలపై ఎదురుదాడికి దిగుతున్నది.
జో బైడెన్‌తో మన దేశం కుదుర్చుకున్న అవగాహన ప్రకారం ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై పన్ను తగ్గి ఎగుమతి అవకాశాలు మెరుగుపడతాయని ఆ రంగాల వారు ఆశిస్తుండగా ట్రంప్‌ చేసిన తాజా ప్రకటనతో పరిస్థితి తిరిగి మొదటికి వస్తుందా? అన్న అనుమానం కలుగుతున్నది. అయితే మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మాదీ అంతే అన్న లోకోక్తి తెలిసిందే. అమెరికా లేకపోతే పూట గడవదు అనే పరిస్థితి ఎవరికీ లేదు, అమెరికాతో సహా అన్ని దేశాలూ ఏదో ఒకదాని కోసం ఇతరుల మీద ఆధారపడాల్సినవే. జపాన్‌ సంస్థ నోమురా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు వెల్లడించిన నివేదికలో ట్రంప్‌ గెలిస్తే రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య విబేధాలను పక్కన పెడతాడని, చైనాపై ఆంక్షలను పెంచుతాడని, దాని స్థానంలో భారత్‌ను ముందుకు తెస్తాడని, అది ఎంతో ఉపయోగమని చెప్పింది.
ఇక ట్రంప్‌ గతానికి వస్తే మన దేశం గురించి అన్న మాటలు ఇన్నిన్ని కాదు. అయినప్పటికీ ‘అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌’ అంటూ ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వెళ్లి మరీ అక్కడ ప్రచారం చేసి వచ్చారు.అయితే గత ఎన్నికల్లో ట్రంప్‌ మట్టికరిచాడు.మోడీ పరువు గంగలో కలిసింది. దిగుమతి పన్నులను భారత్‌ దుర్వినియోగపరుస్తున్నదన్నాడు ట్రంప్‌. ప్రపంచంలో ఎక్కువ మొత్తాలను విధిస్తున్న దిగుమతి పన్నుల చక్రవర్తి వంటి పదాలతో అవమానించాడు. అంతర్జాతీయ లావాదేవీలలో డాలర్‌ను పక్కన పెట్టాలన్న బ్రిక్స్‌ దేశాలు వెనక్కు తగ్గి అలాంటిదేమీ లేదని హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకుంటే ప్రతికూల చర్యలు తప్పవని బెదిరించాడు.
ఇటీవలి సంవత్సరాలలో మనదేశ విదేశీ వాణిజ్య భాగస్వాములలో చైనా, అమెరికా ఒకటి రెండు స్థానాలలో ఉంటున్నాయి. ట్రంప్‌ ఎన్ని మాటలు మాట్లాడినా అమెరికా అధ్యక్షుడు భారత్‌కు మిత్రుడని, రెండుదేశాల సంబంధాలు మరింతగా విస్తరిస్తాయని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ వంటివారు పొగుడుతూనే ఉన్నారు. హెచ్‌1బి వీసాల గురించి అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. గడచిన పదేండ్లలో చూస్తే అవి తగ్గాయి తప్ప పెరగలేదు. అమెరికా విధాన జాతీయ సంస్థ (ఎన్‌ఎఫ్‌ఏపి) సమాచారం ప్రకారం 2014-15లో ఉన్న వీసాల సంఖ్యతో పోలిస్తే ఎనిమిదేండ్ల కాలంలో 75శాతం తగ్గాయి, అమెరికాలోని మనదేశ కంపెనీల రిక్రూట్‌మెంట్లు కూడా తగ్గాయి. అమెరికాకు అగ్రస్థానమే తన లక్ష్యం అని చెబుతున్న ట్రంప్‌ అధ్యక్షుడుగా కొలువు తీరాక నిజంగా ఏం చేస్తాడో చూడాల్సి ఉంది.