– మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు నిషేధం
వాషింగ్టన్ డిసి (యుఎస్‌ఏ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రీడల్లోనూ దూకుడు చూపిస్తున్నాడు. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ల ప్రాతినిథ్యంపై గతంలోనే గళం విప్పిన ట్రంప్.. తాజాగా మహిళా క్రీడాకారులకు ఇచ్చిన హామీని నేరవేర్చాడు. అమెరికాలో మహిళల క్రీడాంశాల్లో ఇక నుంచి ట్రాన్స్‌జెండర్లను అనుమతించరు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వైట్‌హౌస్‌లో కార్యనిర్వాహక ఆదేశాన్ని (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) జారీ చేశారు. మహిళల క్రీడల్లో పోటీపడే అర్హత బయలాజికల్ లింగ ప్రామాణికంగానే నిర్ణయించాలని.. ఇతర ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవద్దని ట్రంప్ తన ఆదేశంలో స్పష్టం చేశారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో అమెరికాలో ఇక అన్ని క్రీడా సంఘాలు ట్రాన్స్‌జెండర్లను మహిళల క్రీడాంశాల్లో అనుమతించలేవు.
ఐఓసీపై ఒత్తిడి : ట్రంప్ ఆదేశంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)పై ఒత్తిడి పెరగనుంది. 2028 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లోనూ ట్రాన్స్‌జెండర్లను మహిళల క్రీడాంశాల్లో అనుమతించకూడదని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఈ దిశగా ఐఓసీపై ఒత్తిడి తీసుకురావాలని సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్‌జెండర్ల అంశంలో ఐఓసీకి ఎటువంటి మార్గదర్శకాలు లేవు. అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు తమకు తోచినట్టు నిర్ణయాలు తీసుకునే అధికారం ఐఓసీ ఇచ్చింది. స్విమ్మింగ్‌లో కఠిన నిబంధనలు ఉంటే.. ట్రయథ్లాన్‌లో సరళంగా ఉన్నాయి. ట్రంప్ ఒత్తిడితో ఐఓసీ త్వరలోనే ఈ అంశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.