కుబేర వర్గాల గుప్పిట్లో ట్రంప్‌ పాలన

Trump's rule in the secret of the clansడోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభోపన్యాసం, అధ్యక్షుడుగా మొదటి రోజున ఆయన జారీ చేసిన అధికార ఉత్తర్వుల పరంపరను బట్టి చూస్తే ఆయన ఏం చేస్తానని చెప్పాడో అదే చేశాడని అర్థమవుతుంది. మరోసారి అమెరికా గొప్ప దేశంగా చేస్తానని చెప్పిన ప్రకారం ట్రంప్‌ పనామా కాల్వను స్వాధీనం చేసుకుంటామని బెదిరింపుకు దిగాడు. 1977లో పనామా ఒప్పందం ప్రకారం దానిపై అదుపు పనామాకు అప్పగించబడింది. ‘గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో’కు ‘గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా’ అని కొత్తగా నామకరణం చేశాడు. ఇటీవలి చరిత్రలో ఏ అమెరికా అధ్యక్షుడూ చేయని విధంగా తమ భూభాగం విస్తరించుకోవడం కోసం మరిన్ని సామ్రాజ్యవాద విస్తరణ చర్యలు చేపడతానని ప్రకటించారు. మెక్సికోతో దక్షిణ సరిహద్దులో ఎమర్జన్సీ ప్రకటించి వలసదార్లు సరిహద్దు దాటి రాకుండా సైన్యాన్ని మొహరించాలని ఆదేశాలిచ్చారు. పుట్టుకతోనే పౌరసత్వ హక్కును రద్దు లచేయడంతో సహా మరిన్ని వలస నిరోధక చర్యలు కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా జాతి వ్యతిరేకతను పెంచి పచ్చి మితవాద శక్తులకు ఊతమిచ్చేవే.మరో రకం అధ్యక్ష ఉత్తర్వుల ప్రకారం పారిస్‌ వాతావరణ పరిరక్షణ ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించు కుంటుంది. దేశంలో అంతర్గతంగానూ పర్యావరణ పరిరక్షణ చర్యల వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. చమురు కంపెనీల లాబీ ఎలాంటి నిబంధనలు లేకుండా విచక్షణా రహితంగా వ్యవహరించడానికి ఈ స్వేచ్ఛ పొందబోతున్నది.
స్పష్టమైన సంకేతం
ట్రంప్‌ మలి దఫా అధ్యక్ష పీఠం అధిష్టించడంలో కొట్టొచ్చినట్టు కనిపించిన అంశం సాంకేతిక కుబేరుల, మహా సంపన్నుల బహిరంగ మద్దతు. ఇది ప్రమాణ స్వీకారంలో గ్రాఫిక్స్‌తో సహా గోచరమైంది. ప్రపంచ ధనాఢ్యులలోనే ప్రథముడైన ఎలన్‌ మస్క్‌ ఇంకా ఇతర మహా సంపన్నులు పాలనా యంత్రాంగంలో నిర్వహించిన పాత్రను బట్టి చూస్తే ఇది మహా కుబేర రాజ్యం (ప్లూటోక్రసీ)గా కనిపిస్తుంది. ఫెడరల్‌ ప్రభుత్వ వ్యవస్థను కుదించడం వల్ల సామాజిక భద్రతా సదుపాయాలు, సామాజిక సంక్షేమ వ్యయం దెబ్బతిని పోతాయనే భయాలు అలుముకున్నాయంటే అందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. బడా వ్యాపారవేత్తలకూ కార్పొరేట్‌ ప్రయోజనాలకు యథేచ్ఛగా అవకాశమిచ్చే పాలనా వ్యవస్థ ఇది.
సరికొత్త సామ్రాజ్యవాద పోకడ
అంతర్జాతీయ సంబంధాల విషయంలో ట్రంప్‌ అధ్యక్ష కాలం బహుళపక్ష వ్యవహారాలను, వాణిజ్య సుంకాలు వాతావరణ మార్పుల రక్షణ చర్యలను విచ్ఛిన్నం చేయడం జరిగినా మౌలికంగా అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడం మాత్రం కొనసాగుతుంది. బైడెన్‌ ప్రభుత్వం పరిశేష నయా మితవాద విదేశాంగ విధానాన్ని అమలు చేయడంలో అపఖ్యాతి మూటకట్టుకుంది. గాజాలో ఇజ్రాయిల్‌ మారణయుద్ధానికి నిధులు సమకూర్చింది. ఉక్రెయిన్‌కు నిరాటంకంగా సైనిక, ఆర్థిక సాయం అందించడం ద్వారా రష్యా ఉక్రెయిన్‌ ఘర్షణ పూర్తి స్థాయి యుద్ధంగా మార్చడానికి కారణమైంది. చైనాతో సంఘర్షణను పెంచడానికి, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో కూటములు కట్టడానికి బైడెన్‌ ప్రభుత్వం పాల్పడింది.ట్రంప్‌ ప్రభుత్వం పొందికను బట్టి చూస్తే లాటిన్‌ అమెరికాలో అది మరింత దూకుడుగా వ్యవహ రిస్తుందని అంచనా వేయొచ్చు. క్యూబా, వెనిజులాలలో మరింతగా జోక్యాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మోడీ సర్కారు ఆరాటం
అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ సరుకులపై సుంకాల విషయంలోనూ ఆంక్షలతో కూడిన వీసాల విషయంలోనూ ట్రంప్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటాడనేది మోడీ ప్రభుత్వం ఆతృతగా ఎదురుచూస్తున్నది. సరైన పత్రాలు లేని వలసదారులను గనక వెనక్కు పంపేయడమనే తన బెదిరింపును ట్రంప్‌ అమలు చేసేట్టయితే ఇప్పటికే గుర్తించబడిన, కొంత ప్రక్రియ జరిగిన ఇరవై వేల మంది భారతీయులను వెనక్కు పంపేయవచ్చు.మరింత ముఖ్యమైన విషయమేమంటే మోడీ ప్రభుత్వం ట్రంప్‌ విశ్వసనీయమైన మంచి మిత్రుడని ఎలాగోలా నిరూపించడానికి తాపత్రయ పడుతున్నది. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ గత కొద్దివారాల్లో వాషింగ్టన్‌లో రెండుసార్లు మకాం వేశారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం కోసం వెళ్లిన ఆయన క్వాడ్‌ కూటమికి చెందిన ఇతర విదేశాంగ మంత్రులతో పాటు అమెరికా నూతన విదేశాంగ మంత్రిని కలుసుకున్నారు. కానీ ట్రంప్‌తో ఫోటో తీసుకునే అవకాశం మాత్రం ప్రమాణ స్వీకారానికి ముందు జరిగిన విందు సందర్భంలో ముఖేష్‌, నీతూఅంబానీలకే దక్కింది. ఇప్పుడు వాషింగ్టన్‌లో మంత్రుల కన్నా మహా కుబేరులకే ఆధిక్యత వచ్చింది.మోడీ సర్కారు ట్రంప్‌ చాంచల్యాలపైన ఆధారపడి అడుగులు తప్పుగా వేయడంగాక మరింత వ్యూహాత్మక స్వాతంత్య్రం పునరుద్ధరించుకునే విధంగా తీవ్రమైన మందగమనంలో పడిన భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి తగిన విధంగా తన వ్యూహాన్ని పునరుల్లేఖించుకోవాలి.
(జనవరి 22 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’
సంపాదకీయం)