ట్రంప్‌ సుంకాల బెదిరింపులు-పర్యవసానాలు

Trump's Tariff Threats - Consequencesఅధిక సుంకాలను విధిస్తానంటూ ట్రంప్‌ తక్కిన దేశాలను బెదిరిస్తున్నాడు. మొదట బ్రిక్స్‌ దేశాలను బెదిరించాడు. ఆ దేశాలు గనుక డాలర్‌ మాధ్యమంలో వ్యాపారం చేయడం మానుకుంటే వాటి సరుకులపై అమెరికాలో 100 శాతం దిగుమతి సుంకం విధిస్తానని ప్రకటించాడు. ఆ తర్వాత వంతు యూరోపియన్‌ యూనియన్‌ (ఇ.యు) దేశాలది. 2023లో ఆ దేశాలు అమెరికాకు చేస్తున్న ఎగుమతులు అమెరికా నుండి చేసుకుంటున్న దిగుమతులకన్నా 208.7 బిలియన్‌ డాలర్ల మేరకు ఎక్కువగా ఉన్నాయి. అంటే వాటితో అమెరికా వాణిజ్యం లోటులో ఉంది. అందుచేత ఆ దేశాలు గనుక అమెరికా నుండి ముడిచమురు, సహజ వాయువు కొనుగోళ్ళను పెంచకపోతే ఆ దేశాల నుండి అమెరికాకు వచ్చే దిగుమతుల మీద సుంకాలను పెంచుతానని హెచ్చరించాడు. ఇవిగాక ప్రపంచంలో ఏ దేశం నుండి అయినా అమెరికాకు దిగుమతయ్యే సరుకులన్నింటి మీదా 10 శాతం సుంకం పెంచుతానని, ప్రత్యేకించి చైనా నుండి వచ్చే దిగుమతుల మీద 60 శాతం పెంచుతానని ప్రకటించాడు. 2023లో చైనా నుండి అమెరికాకు దిగుమతయ్యే సరుకులు ఎగుమతులకన్నా 279.4 బిలియన్‌ డాలర్ల మేరకు ఎక్కువగా ఉన్నాయి. 2018లోనైతే అవి 418 బిలియన్‌ డాలర్లు అధికంగా ఉన్నాయి. అప్పటి నుంచి కొంత తగ్గినా, ఇంకా చైనాతో అమెరికా వాణిజ్య లోటు గణనీయంగానే ఉంది.
ఇలా విధించే అధిక సుంకాల ఫలితంగా ఆర్థిక రంగంలో ముఖ్యమైన పరిణామాలు జరుగుతాయి. ఇప్పటికీ ఇ.యు దేశాలు ఇంకా రష్యన్‌ ముడిచమురు, సహజ వాయువు దిగుమతుల మీద కొంతవరకూ ఆధారపడతూనే వున్నాయి. అది కూడా లేకుండా మొత్తం అమెరికా నుండే కొనుగోలు చేస్తే అప్పుడు దానివలన ఇ.యు దేశాల్లో చమురు ధరలు ఏమీ పెరగకపోవచ్చు. కాని అమెరికాలో పెట్రోలు, సహజ వాయువు ధరలు కనీసం 30 శాతం పెరగుతాయి. ఇయు దేశాలు అదనంగా కొనుగోళ్ళు పెంచిన ఫలితంగా అమెరికన్‌ చమురు డిమాండ్‌ పెరుగుతుంది. ముడిచమురు అంతర్జాతీయ ధరలు ఒకే విధంగా ఉంటాయి గనుక ఇ.యు లో దాని ప్రభావం ఉండదు. కాని అమెరికా వద్ద చమురు నిల్వలు తగ్గిపోయి, ఆ దేశంలో పెరిగే డిమాండ్‌ ను తట్టుకోడానికి అక్కడ ధరలు పెరుగుతాయి. ఇలా పెరిగిన డిమాండ్‌ ను తట్టుకోడానికి అమెరికా తన చమురు ఉత్పత్తిని అందుకు తగినట్టు పెంచుతుందని ట్రంప్‌ ప్రకటించాడు. కాని అమెరికాలో చమురు ఉత్పత్తి వ్యాపారం అంతా ప్రైవేటు రంగంలోనే ఉంది. చమురు ఉత్పత్తిని పెంచాలంటే ప్రైవేటు కార్పొరేట్లు అందుకు అదనంగా పెట్టుబడులు పెట్టాలి. అది అంత తేలికేమీ కాదు. ముడిచమురు, సహజ వాయువులను వెలికి తీయడం అనేది పర్యావరణ సమస్యను పెంచు తుంది. పర్యావరణ సమతుల్యతను నిలబెట్టడానికి అమెరికా ఆమోదించిన పరిమి తులను ఉల్లంఘిం చడం అంత సులభసాధ్యం ఏమీ కాబోదు. దానిని దృష్టిలో ఉంచుకునే ప్రైవేటు పెట్టుబడిదారులు అదనపు పెట్టుబడులను పెట్టడానికి అంత ఉత్సాహాన్ని చూపకపోవచ్చు. అదే విధంగా బ్రిక్స్‌ దేశాల మీద 100 శాతం సుంకాన్ని అదనంగా విధించడం వలన ఆ దేశాలు దానికి ప్రతీకారంగా తీసుకునే చర్యలు అమెరికన్‌ ఎగుమతులను దెబ్బ తీసే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఇంకా ఆచరణ రూపం దాల్చలేదు. కాని అన్ని దిగుమతులపైనా 10 శాతం సుంకం పెంపు అనే ప్రతిపాదన, చైనా దిగుమతుల మీద 60 శాతం సుంకం పెంపు ప్రతిపాదన కార్యరూపం ధరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చర్యల పర్యవసానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. కాస్సేపు ఈ రెండు చర్యలకూ తక్కిన దేశాల నుండి ప్రతీకార చర్యలు ఉండవనే అనుకుందాం. బైట దేశాల దిగుమతుల మీద సుంకాలు పెరిగితే వాటి ధరలు అమెరికాలో పెరుగుతాయి. అప్పుడు వాటికి బదులు అమెరికన్‌ ఉత్పత్తులనే కొనుగోలు చేయడానికి అక్కడి ప్రజలు మొగ్గు చూపుతారు. దానివలన అమెరికన్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుంది. ఆ డిమాండ్‌ను అందుకోడానికి వీలుగా అమెరికన్‌ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచవలసి వుంటుంది. దాని పర్యవసానంగా అమెరికాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
అదే సమయంలో దిగుమతుల మీద సుంకాలు పెంచినందువలన వాటి ధరలు పెరుగుతాయి. దాని ఫలితంగా అమెరికన్‌ ప్రజల కొనుగోలుశక్తి దెబ్బ తింటుంది. అది ఉపాధి అవకాశాలు తగ్గిపోడానికి దారి తీస్తుంది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ట్రంప్‌ ప్రభుత్వం గనుక ‘పొదుపు’ చర్యలు చేపట్టడం కూడా జరిగితే (అంటే ప్రజా సంక్షేమం మీద ఖర్చు తగ్గిస్తే) ప్రజల కొనుగోలు శక్తి ఇంకా బాగా తగ్గుతుంది. దాని వలన ఉపాధి ఇంకా ఎక్కువగా దెబ్బ తింటుంది. అయితే, రెండోవైపు దిగుమతుల మీద సుంకాలు పెంచినందువలన దేశీయ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగి దాని వలన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి గనుక నికరంగా అమెరికాలో అటు ఉత్పత్తి, ఇటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అనుకుందాం.
అయితే తక్కిన ప్రపంచంలో పరిణామాలు వేరేగా ఉంటాయి. అమెరికా విధించిన సుంకాల పెంపు వలన ఆ దేశాల నుండి అమెరికాకు జరిగే ఎగుమతులు తగ్గుతాయి. ఆ మేరకు తమ తమ దేశాల్లో డిమాండ్‌ను పెంచే చర్యలు చేపట్టడం సాధ్యపడదు కనుక ఆ దేశాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. నయా ఉదారవాద చట్రంలో చైనా మినహా తక్కిన దేశాలన్నీ ఉన్నాయి కనుక ఆ దేశాల ప్రభుత్వాలు తమ తమ దేశాల్లో డిమాండ్‌ను పెంచడానికి కావలసిన చర్యలను చేపట్టడం సాధ్యపడదు.
అలా డిమాండ్‌ను పెంచాలంటే ప్రభుత్వం చేసే వ్యయాన్ని పెంచాలి. అందుకు తమ దేశ ద్రవ్యలోటునైనా పెంచాలి. లేదా పెట్టుబడిదారుల మీద అదనపు పన్నులనైనా వేయాలి. కాని ఈ రెండు రకాల చర్యలనూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంగీకరించదు. ఐనా దానిని లెక్క చేయకుండా ఏ దేశమైనా వ్యయాన్ని పెంచడానికి చర్యలు చేపడితే ఆ దేశం నుండి ద్రవ్య పెట్టుబడి క్షణాల్లో బైటకు తరలిపోతుంది. దాని ఫలితంగా ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు లోనౌతుంది.
నిజానికి అమెరికాలో దిగుమతి సుంకాల పెంపు అనేది కూడా ఎంతో కొంత మేరకు నయా ఉదారవాద చట్రానికి భిన్నమైన చర్యగానే చెప్పవచ్చు. అటువంటి చర్యలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కొంత వరకూ సహిస్తుంది. అదే గనుక ఏ దేశమైనా పెట్టుబడుల సంచారం మీద ఆంక్షలు విధిస్తే ఏ మాత్రమూ సహించదు. అందుకే ట్రంప్‌ పెట్టుబడుల కదలికలను నియంత్రించే విషయంలో ఒక్కమాట కూడా అనలేదు.
చైనా పరిస్థితి పూర్తిగా భిన్నం. నిజానికి కొంతకాలంగా అమెరికన్‌ ప్రభుత్వాలు తమ దేశంలోకి వచ్చిపడుతున్న చైనా ఉత్పత్తుల తాకిడి నుంచి తమ దేశాన్ని కాపాడుకోడానికి చర్యలు తీసుకుంటూనే వున్నాయి. అందుకే అమెరికాకు చైనా దిగుమతులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే దాని ప్రభావాన్ని వీలైనంత మేరకు తగ్గించడానికి చైనా తన దేశీయ మార్కెట్‌ ను విస్తరించుకుంటోంది. ఇలా చైనా చేయగలగడానికి కారణం చైనా ఆర్థిక వ్యవస్థ, అందులో ఎన్ని రకాల మార్పులు జరిగినా, ఇప్పటికీ ప్రధానంగా ప్రభుత్వ నియంత్రణలో నడిచే వ్యవస్థగానే కొనసాగుతోంది. అక్కడ రాజకీయ నిర్ణయాలకు లోబడి ఆర్థిక వ్యవహారాలు సాగుతాయి. ఇంకా అక్కడ ప్రభుత్వ రంగమే గణనీయమైన భాగంగా ఉంది. పెట్టుబడిదారుల చేతుల్లో లేని ఈ భాగంలో పెట్టుబడికి, వేతనాలకు సంబంధించిన నిర్ణయాలన్నీ ప్రభుత్వమే చేస్తుంది. తక్కిన ప్రపంచంలో కార్మికుల నిజ వేతనాలు దాదాపు స్తంభించిపోయివున్న ప్రస్తుత కాలంలో చైనాలో కార్మికుల నిజవేతనాలు పెరుగుతున్నాయి. ఇందుకు కారణం అక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలే. అందుచేత చైనాలోని దేశీయ మార్కెట్‌ విస్తరణను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలు అడ్డుకోలేవు. కాని తక్కిన పెట్టుబడిదారీ దేశాల్లో అడ్డుకోగలుగుతాయి.
ఈ కారణంగా అమెరికా విధించే అధిక సుంకాల ప్రభావం వలన చైనా మినహా తక్కిన ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం మరింత తీవ్రం అవుతుంది (నయా ఉదారవాద చట్రం నుండి బైట పడినప్పుడే ఈ పరిస్థితి నుండి బైట పడడం సాధ్యం). మూడవ ప్రపంచదేశాల్లో, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ తీవ్రత మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో ట్రంప్‌ దిగుమతి సుంకాలు పెంచితే మౌన ముద్ర పాటించే బ్రెట్టన్‌వుడ్‌ సంస్థలు మూడవ ప్రపంచ దేశాలకు మాత్రం అటువంటి రక్షణాత్మక చర్యలు చేపట్టడద్దని,
స్వేచ్ఛా వ్యాపారం చాలా విశిష్టమైనదని జ్ఞానబోధలు చేస్తాయి. దానితోబాటు ఆ దేశాలు ద్రవ్యలోటును నియంత్రించే విషయంలో షరతులకు కచ్చితంగా లోబడి వుండేలా ఒత్తిడి చేస్తాయి. ఆ విధంగా మూడవ ప్రపంచ దేశాలన్నీ నిస్సహాయంగా అమెరికన్‌ ప్రభుత్వం తీసుకునే రక్షణాత్మక చర్యల దుష్ప్రభావాన్ని భరించవలసి వస్తుంది. దానితోబాటు నానాటికీ తీవ్రమయ్యే ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని కూడా మోయవలసి వుంటుంది.
ఇలా ఆర్థిక మాంద్యం తీవ్రం అవుతున్నకొద్దీ, రెండో పక్క నయా ఫాసిస్టు ధోరణులు కూడా ప్రపంచవ్యాప్తంగా బలపడతాయి. ఆర్థిక సంక్షోభ కాలంలో కార్పొరేట్లకు, నయా ఫాసిస్టు శక్తులకు నడుమ బంధం బలంగా ఏర్పడుతుంది. ఆ సంక్షోభం ముదురుతున్నకొద్దీ ఈ బంధం కూడా మరింత బలపడుతుంది. ఏవో కొన్ని మైనారిటీ సెక్షన్ల ప్రజలను శత్రువులుగా చిత్రించి సమాజ జీవిత వాస్తవాల నుండి ప్రజల దృష్టిని పక్కకు మరల్చే ప్రచారం ఉధృతమౌతుంది.
పెట్టుబడిదారీ విధానం ముందుకు సాగుతున్నకొద్దీ ప్రజలు సోషలిజం, లేదా ఆటవిక వ్యవస్థ-ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని రోజా లగ్సెంబర్గ్‌ చెప్పినది నేడు వాస్తవ రూపం ధరిస్తోంది. పెట్టుబడిదారీ విధానపు తాజా దశ అయిన నయా ఉదారవాద వ్యవస్థ ముందు ఇప్పుడున్న దారులన్నీ మూసుకుపోయాయి. అది ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాన్ని ఆటవిక స్వభావం కల నయా ఫాసిజం వైపు నెడుతోంది. ఈ పరిస్థితి నుండి బైట పడడానికి సోషలిజం కోసం పోరాడడం ఒక్కటే మార్గం.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్‌ పట్నాయక్‌