అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలిచాడు. గురువారం రాత్రి వరకు 87శాతం ఓట్ల లెక్కింపు జరిగే సమయానికి 538 ఎలక్ట్రరల్ ఓట్ల కాలేజీ స్థానాలలో ట్రంప్ 295 చోట్ల, కమలాహారిస్ 226 చోట్ల గెలుపు లేదా ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. ట్రంప్ గెలుపు ఖాయంగా మారినప్పటికీ లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. అందువలన ఎన్నికల ఫలితాల గురించి ఎవరు చెప్పినా ప్రాథమిక పరిశీలన మాత్రమే. పూర్తి సమీక్షకు ఇంకా వ్యవధి పడుతుంది. గెలిచిన వారిని వీరులు శూరులు అని పొగడటం మీడియాలో సహజంగా జరిగేదే ! ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలను బట్టి ప్రధాన అభ్యర్ధులిద్దరికీ గత ఎన్నికల కంటే ఓట్లు తగ్గాయి. ట్రంప్‌కు ఇరవై లక్షలు, కమలకు కోటీ 30 నుంచి నలభై లక్షల వరకు తగ్గుతాయని అంచనా. దీన్ని బట్టి డెమోక్రటిక్ పార్టీ ఓడిందో రిపబ్లికన్ పార్టీ గెలిచిందో ఎవరికి వారు అర్థం చేసుకోవచ్చు.గత ఎన్నికల్లో జోబైడెన్‌కు 8.128కోట్ల ఓట్లు రాగా ట్రంప్‌కు 7.422 కోట్లు వచ్చాయి. ఈసారి 87శాతం లెక్కింపు పూర్తయ్యే సమయానికి ట్రంప్‌కు 7.26 కోట్లు, కమలకు 6.79కోట్ల ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి డెమోక్రటిక్ పార్టీ పట్ల ఓటర్లు ఎంతగా అనాసక్తితో ఉన్నారో స్పష్టమైంది. ఇదే ట్రంప్ గెలిచేందుకు తోడ్పడింది తప్ప మరొకటి కాదు.
రెండు పార్టీల తరఫున కార్పొరేట్ శక్తులు తారసిల్లాయి. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్, అతగాడి పూర్వపు ట్విటర్ ప్రస్తుత ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ట్రంప్ గెలుపులో ఒక ప్రధాన పాత్ర పోషించటాన్ని చూసిన వారు ఇద్దరు కార్పొరేట్‌లు ఈ ఎన్నికల్లో గెలిచినట్లు వ్యాఖ్యానించటం సబబే. ట్రంప్‌ను ఎందుకు ఓడించాలో డెమోక్రాట్లు గట్టిగా చెప్పారు తప్ప తమను ఎందుకు గెలిపించాలో ఓటర్లకు నచ్చచెప్పలేకపోయారని కొందరు చెబుతున్నారు. ఈ కారణంగానే సానుకూలంగా ఉన్నవారు కూడా ఓటింగ్‌కు రాలేదని చెప్పవచ్చు.2018 తరువాత జరిగిన అన్ని జాతీయ ఎన్నికలలో ట్రంప్ ముందుకు తెచ్చిన అజెండాకు వ్యతిరేకంగా ఓటు చేసిన అమెరికన్లు ఇప్పుడు నిరాసక్తత వ్యక్తం చేయటం ఒక విధంగా ఆందోళన కలిగించే పరిణామమే. జోబైడెన్ విఫల విధానాలు, కార్మిక వర్గాన్ని వదిలి కార్పొరేట్లు, ముఖ్యంగా ఆయుధ కంపెనీల యజమానుల సేవలో తరించటం, ఈ ఎన్నికల్లో కూడా ట్రంప్‌తో పోటీ పడి తాము కూడా పన్నురేటు తగ్గిస్తామని చెప్పటం వంటి అనేక అంశాలు డెమోక్రాట్ల మద్దతుదార్లను నిరాశకు గురి చేశాయి. అమెరికాలో పన్ను రేటు తగ్గించటం అంటే కార్పొరేట్లకు దోచిపెట్టడం, ఆ మేరకు కార్మికవర్గానికి సామాజిక భద్రతా పధకాలకు కోత పెట్టటం లేదా భారాలు మోపటం తప్ప మరొకటి కాదు. గత నాలుగేండ్లలో నిజవేతన పెరుగుదల స్తంభన లేదా తిరోగమనం, ధరల పెరుగుదలతో జనం సతమతమౌతున్నారు. ఈ అసంతృప్తిని ట్రంప్ తన వాగాడంబరంతో సొమ్ము చేసుకున్నాడు.
అమెరికన్లు యుద్ధాల పట్ల విసిగి ఉన్నారు. అందుకే తనకు అధికారమిస్తే యుద్ధాలను అపుతానని ట్రంప్ చెప్పాడు.సాంప్రదాయకంగా డెమోక్రాట్లకు ఓటు వేసే అరబ్బు జాతీయులు ఈసారి ట్రంప్‌కు వేశారన్న వార్తలు వచ్చాయి. పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, లెబనాన్, ఎమెన్, ఇరాన్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని జోబైడెన్ నిస్సి గ్గుగా బలపరచటమే గాక ఆయుధాలు, నిధులు కూడా పెద్ద ఎత్తున అందచేస్తున్న పూర్వరంగంలో ట్రంప్ మీద ఇష్టం ఉన్నా లేకున్నా జోబైడెన్ మీద వ్యతిరేకతతో ఓట్లు వేసినట్లు చెప్పవచ్చు. నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇజ్రాయిల్ దుర్మార్గాలకు మద్దతు, పలుచోట్ల ఉద్రిక్తతలను రెచ్చగొట్టటం యుద్ధాలకు మద్దతివ్వటం తప్ప వ్యతిరేకించిన దాఖలాలు లేవు. లాటినోలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని, వర్ణ వివక్షకు గురయ్యే ఆఫ్రో-అమెరికన్లు కూడా కొందరు ట్రంప్‌కు ఓటువేశారని,అబార్షన్లను వ్యతిరేకించే రిపబ్లికన్లకు మహిళలు ఎందుకు ఓట్లు వేశారన్నది పరిశీలించాల్సి ఉంది.
గతంలో ట్రంప్ అమెరికా కార్పొరేట్లకు అనుకూలంగా చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశాడు.దాన్ని బైడెన్ కొనసాగించాడు. ఇప్పుడు ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలే ఉన్నాయి.నరేంద్రమోడీకి ట్రంప్ స్నేహితుడు గనుక మనదేశానికి ఒరగబెడతాడని కొందరు చెబుతున్నారు.
గతంలో అలాంటి ఆచరణ లేదు. అంతర్గతంగా ప్రాజెక్టు 2025పేరుతో రూపొందించిన కార్పొరేట్ అజెండాను అమలు చేయించేందుకే డాలర్ల మూటలతో ట్రంప్ వెనుక వారంతా నిలిచారన్నది స్పష్టం. దాని అమలుకు పూనుకుంటే మరోసారి అమెరికాలో వాటికి వ్యతిరేకంగా కార్మికవర్గం వీధుల్లోకి రావటం అనివార్యం. అది ఏ రూపంలో ఉంటుందన్నది జనవరిలో ట్రంప్ ముందుకు తెచ్చే అజెండాను బట్టి ఉంటుంది. డెమోక్రాట్ల మీద అసంతృప్తితో ఓటింగ్‌కు రాని కార్మికవర్గం ట్రంప్ దాడిని చూస్తూ ఊరుకోదు.