బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సిగ్గుతో తలవంచుకొని జాతికి క్షమాపణ కోరాలి. మొత్తం మంత్రి వర్గం చెంపలేసుకొని రాజీనామా చేయాలి. సుప్రీంకోర్టు ఈ కేసుపై ఇచ్చిన తీర్పు డా.బీ.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం విలువను మరోసారి పెంచింది. చట్టాన్ని, ధర్మాన్ని కాపాడింది. ఈ కేసులో హంతక రేపిస్టులైన 11 మంది నీచుల విడుదలకు తోడ్పడిన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టి, ఉతికి ఆరేసింది. ఆ రాష్ట్రం మంజూరు చేసిన క్షమాభిక్షను రద్దు చేసి ఆ 11 మంది ముష్కరులను రెండు వారాల్లోగా జైలు అధి కారుల ముందు లొంగిపోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ తీర్పుతో గుజరాత్ సర్కార్ మరోసారి తలవంపులకు గురైంది. న్యాయమూర్తులైన జస్టిస్ నాగరత్నమ్మ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల సుప్రీంకోర్టు బెంచ్, 2002 నాటి గుజరాత్‌లో జరిపిన అత్యాచారాల హంతక ముద్దాయిలకు శిక్షాకాలంలో రెమి షన్ ఇవ్వవచ్చుననే నిర్ణయంతో సిఫార్సు చేసిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను సుప్రీం తప్పుపట్టింది. ఆ సిఫార్సుని ఆధారం చేసుకుని యావత్ జీవకారాగార శిక్ష అనుభవిస్తున్న వారిని 2022 ఆగస్టు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసలు అలాంటి రెమిషన్ యధాలాపపు తీర్పునిచ్చే కనీస అర్హత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేనే లేదని సుప్రీంకోర్టు బల్లగుద్ధి మరీ స్పష్టం చేసింది. 2002లో గోధ్రా రైలులో సంభవించిన మారణకాండను వంక పెట్టుకొని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఏలుతున్న గుజ రాత్‌లో, సర్వమానవాళి సిగ్గుపడేలా ఒక అమాయకపు ముస్లిం గృహిణిపై, ఇతర వందలాది ముస్లీం ప్రజానీకంపై ఈ దుష్కర పాపిష్టి మతోన్మాద మూకలు ఘోరమైన హత్యాకాండ జరిపారు. ముస్లీం మహిళలపై దారుణంగా రోజుల తరబడి లైంగిక దాడు లు చేసారు. అలాంటి బీజేపీ నరహంతకుల దాడుల నుండి తప్పించుకోవటానికి 2002 మార్చి మూడవ తేదీన అహ్మదా బాద్‌కు దగ్గరలోని ‘రంధిక్ పూర్’ అనే గ్రామం విడిచిపోతున్న వారిలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానో అనే 21 ఏళ్ల ముస్లీం మహిళపై ఈ నరరూప రాక్షసులు అత్యంత హీనంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అభంశుభం తెలియని ఆమె మూడేళ్ల పసి బాలికతో సహా ఏడుగురు కుటుంబ సభ్యు లను అత్యంత పాశవికంగా హత్య గావించారు. అప్పటి నుండి ఆ కేసు అనేక మలుపులు తిరిగింది. సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో విచారణ చేశారు. గుజరాత్ రాష్ట్రంలో విచారణ జరపటానికి వీలులేదని మహారాష్ట్రలో విచారణను బదిలీ చేసింది. బొంబా యి ట్రయల్ కోర్టు 2008లో ఈ 11 మంది నరహంతక రేపిస్టు లకు ఉరి తీయమని ఆదేశించకుండా కేవలం యావజ్జీవ కారా గార శిక్షను మాత్రమే విధించింది. (ఒక రకంగా ఇది కూడా బాధి తులకు అన్యాయమే) 2017లో ముంబాయి హైకోర్టు వారి శిక్షను ఖరారు చేసింది. 2019లో సుప్రీంకోర్టు బిల్కిస్ బానోకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించమని కూడా గుజరాత్ రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. (కానీ వారు ఒక్క రూపాయి కూడా చెల్లించ లేదు.) కొన్ని కోర్టు సవరణలను అడ్డం పెట్టుకుని గుజరాత్ బీజే పీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలన్న సాకుతో ఇంత తీవ్రమైన నేరస్తులకు 14 ఏండ్ల శిక్షకాలం తరువాత వారికి రెమిషన్ ఇచ్చింది విడుదల చేసింది. (జైలులో కూడా పూర్తికాలం శిక్ష అను భవించలేదు. ఎక్కువకాలం పెరోల్‌పై జైలు బయటే ఉన్నారు.) ఈ సుప్రీంకోర్టు తీర్పులో ”వాస్తవాలను దాచి, మోస పూరిత మార్గాల ద్వారా దోషి ఆ ఆదేశాలు పొందారని వ్యాఖ్యా నించింది.” నిందితులకు ఉపశమనం మంజూరు చేసేటప్పుడు ఏక రూపత ప్రమాణాలను కూడా పాటించలేదు అని పేర్కొంది.వాస్తవానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ రెమిషన్ కు సిఫారసు చేసే అధికారం ఉంటుంది. కానీ, ఆ హక్కును అడ్డం పెట్టుకొని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తనకు లేని అధి కారాన్ని ఆపాధించుకొని రెమిషన్‌కు సిఫారసు చేసింది. ఆ విధంగా అత్యంతకర నేరానికి పాల్పడిన 11మంది హంతక, రేపి స్టులకు 75 ఏండ్ల స్వాతంత్య్ర అమృతకాలం అని పేరు పొందిన 2022 ఆగస్టు 15న విడుదల అయ్యే అవకాశం దొడ్డిదారిలో లభించింది. ఈ దుష్టులను గుజరాత్ రాష్ట్ర బీజేపీ నాయకులు పూలదండలతో, అభినందనలతో స్వాగత సత్కారాలు చేశారు. దేశ భక్తులకు చేసినట్లు విజయోత్సవాలు జరిపారు. దేశం దేశమంతా సిగ్గు పడేట్లు చేసిన ఈ సంఘటనను ప్రశ్నిస్తూ బాధితురాలైన బిల్కిస్ బానో తిరిగి సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ అన్యాయపు తీర్పును వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం)కు చెందిన పార్లమెంటు మాజీ సభ్యురాలు, ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేసిన కెప్టెన్ లక్ష్మీ కుమార్తె, అయిన సుభాషిణి అలీ, లక్నో విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్స్లలర్ ప్రొఫెసర్ రూప్ రేఖ వర్మ, జర్నలిస్ట్ రేవతి లాల్ ఇంకా ఇటీవల పార్లమెంటు నుండి బVిష్కృ తురాలైన మహువ మొయిత్ర లాంటి వారు కూడా ఈ కేసులో ప్రజా ప్రయోజనాల వాజ్యాన్ని వేశారు. ఈరోజు తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు, తనకు లేని అధికారాలతో ఈ నేరస్తులకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ వచ్చేట్లు చేయటాన్ని తప్పుపట్టిన దృష్ట్యా, తక్షణమే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ నేరస్తుల పట్ల పక్ష పాతంతో నిసిగ్గుగా వ్యవహరించినందుకు, నేరస్తులతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయినందుకు బాధ్యత వహించి మంత్రివర్గం మొత్తంగా రాజీనామా చేయాలని ప్రజాస్వామిక వాదులందరూ డిమాండ్ చేస్తున్నారు.
కోలాహలం రామ్ కిశోర్, 9849328496.