నిజం నిద్రలేచేసరికే అబద్ధం ఊరంతా తిరిగొస్తుందని సామెత. ఈ ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో ఇది మరింత ఉధతంగానేగాక వికతంగానూ మారడం మహా విషాదం. ఫలితంగా ‘నిజాలు’ దారుణ హత్యకు గురవుతు న్నాయి. అబద్దాలు సునామీలా విరుచుకుపడి ప్రజల మెదళ్లను కలుషితం చేస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యాలకూ, హమాస్ ఆందోళనకారులకు మధ్య జరుగు తున్న యుద్ధంలోనూ జరుగుతున్నది ఇదే. గాజాలో జరుగు తున్న నరమేథంపై సామాజిక మాధ్యమాలలో, ప్రధాన స్రవంతి మీడియాలో దర్శనమిస్తున్న ప్రసారాలూ ప్రచా రాలు చూస్తే కలవరపెట్టక మానవు. ఇప్పుడక్కడ కోల్పో తున్న ప్రాణాలకంటే వధించబడుతున్న నిజాలే ఎక్కువ అంటే అతిశయోక్తి కాదేమో!.
అయితే ఈ విష ప్రచారాలకు భారతదేశమే ప్రధాన వేదిక కావడం ఆందోళన కలిగించే అంశం. సోషల్ మీడి యాలో కుప్పలు తెప్పలుగా వెలువడుతున్న తప్పుడు పోస్టుల్లో అత్యధికం భారత మూలాలున్న ఖాతాల నుంచే నని పలు నిజనిర్ధారణ సంస్థలు తేల్చి చెబుతున్నాయి. ఉదాహరణకు హమాస్ ఆందోళనకారులు ఒక యూదు బాలుడిని కిడ్నాప్ చేశారని, మరో కుర్రాడిని ట్రక్కులో పడేసి తల నరికేశారని సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఎక్స్’గా మారిన ట్విట్టర్‌లో బ్లూచెక్ ఖాతాల నుంచే ఇటువంటి తప్పుడు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ పాలస్తీనియన్ సాయుధ సమూహం కొంతమంది బాలికలను లైంగిక బానిసలుగా చెరబట్టారని చెబుతూ ఒక వీడియో వైరల్ చేశారు. నిజానికి ఆ వీడియో.. జెరూసలెంలో జరిగిన ఒక పాఠశాల విద్యార్థినుల విహారయాత్రకు సంబంధిం చినది. ఆ వీడియోను సరిగ్గా పరిశీలిస్తే.. ఆ బాలికలు సంతోషంగా ముచ్చటించుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇంత స్పష్టంగా తెలిసిపోతున్నప్పటికీ.. ఈ వీడియోను పాలస్తీని యన్లను దుర్మార్గంగా పేర్కొంటూ కొన్ని వేల మంది షేర్ చేయగా లక్షల్లో ఇంప్రెషన్స్ వచ్చాయి. ఈ వీడియోను షేర్ చేసిన ఖాతాలను విశ్లేషిస్తే.. వాటిలో సింహభాగం భారత్‌కు చెందినవేనని తేలిందని ”బూమ్” పేర్కొంది.
భారతదేశంలోని ప్రముఖ నిజనిర్ధారణ సర్వీసు సంస్థల్లో బూమ్ ఒకటి. పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి తప్పుడు ప్రచారాలపై ఈ సంస్థ పరిశోధన చేసింది. భారతదేశానికి చెందిన ‘ఎక్స్’ యూజర్లు పెద్ద సంఖ్యలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడైందని అల్‌జజీరా వెబ్‌సైట్ పేర్కొన్నది. పాలస్తీని యన్లు క్రూరమైనవారనే భావన చొప్పించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దుష్ప్రచారాలు… దశాబ్దాలుగా వారు అను భవిస్తున్న దారుణమైన హింసను, అణిచి వేతను నిర్దయగా విస్మరిస్తున్నాయి. దశాబ్దాలుగా నెత్తురోడుతున్న పాలస్తీని యన్లు క్రమంగా తమ మాతృభూమినే కోల్పోతున్నారన్న సత్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్నాయి.
ఇటువంటి అసత్యాలను ప్రచారంలో పెడుతున్న వారందరూ పాలస్తీనియన్లపై వ్యతిరేకతను వెల్లగక్కడంతో పాటు, తమ పోస్టులకు ముస్లిం విద్వేషాన్ని జోడిస్తుండటం గమనార్హం. ఈ ఇస్లాం వ్యతిరేక ట్వీట్లలో మెజారిటీ మూలాలు భారతదేశంలోనే కనిపిస్తున్నాయని ఆస్ట్రేలి యాకు చెందిన ఇస్లామిక్ కౌన్సిల్ ఆఫ్ విక్టోరియా నివేదిక సైతం పేర్కొంటున్నది.. దేశంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి దేశంలో విద్వేష ప్రచారాలు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ముస్లిం వ్యతిరేకతను బీజేపీ శ్రేణులు రెచ్చగొడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా… తాజాగా మధ్య ప్రాచ్యంలో చెలరేగిన ఈ యుద్ధ సమయంలో స్వయంగా మోడీ ఇజ్రాయెల్‌కు తన స్పష్టమైన మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇవి మరింత పెచ్చరిల్లుతున్నాయి.
ఇక మెయిన్‌స్ట్రీమ్ మీడియా సైతం ఇందుకు మిన హాయింపు కాకపోవడం మరో విషాదం.. నెతన్యాహూకు మద్దతు ప్రకటిస్తూ ప్రధాని మోడీ మిత్రులైన జో బైడెన్, రిషీసునాక్‌లు చేసిన ఇజ్రాయెల్ పర్యటనలు లోక కళ్యాణార్దమని కీర్తించిన మీడియా.. పాలస్తీనాకు సంఘీ భావం ప్రకటిస్తున్న దేశాధినేతలను మాత్రం అశాంతికి ప్రతీకలుగా చిత్రిస్తున్నది. ఇజ్రాయెల్ దురాక్రమణలకు నిస్సిగ్గుగా మద్దతిస్తూ ‘సుభాషితాలు’ వల్లిస్తున్న పశ్చిమ దేశాధినేతల అభిప్రాయాలనే ప్రపంచాభిప్రా యంగా ప్రచారం చేస్తూ… అదే దేశాల్లో పాల స్తీనాకు మద్దతుగా పెల్లుబుకుతున్న ప్రజల సంఘీభావాన్ని మాత్రం మరుగున పెడుతు న్నది. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదరవు తున్న మనుషులు, పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు, బూడిద కుప్పలవుతున్న నివాసాలతో కూడిన గాజా విలాపాగ్నులకు కారణాలేమిటో, కారకులెవరో చూపకుండా నిజాలను బలికావి స్తోంది. ”ఇజ్రాయెల్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో కుమ్మ రిస్తున్న తప్పుడు ప్రచారాలను గమనిస్తే.. దేశం లోని మితవాద శక్తులు భారతదేశాన్ని ఎంతలా దుష్ప్రచారాల వేదికగా మార్చాయో ప్రపంచం అర్థం చేసుకోగలదు..” అన్న ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం. ”వార్తయందు జగము వర్ధిల్లు తున్నది” అన్న మాట నిజమేకానీ… ఆ వార్తల్లోని సత్యాసత్యాలను గుర్తించకపోతే వ్యవస్థ అవస్థల పాలవు తుందన్నది అంతకంటే నిజం. ఇప్పుడు నిజాలను గ్రహించడం ప్రపంచానికో సవాలు….