
గురుకుల విద్యా సంస్థల, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ డిమాండ్ చేశారు. దశలవారీ ఆందోళనా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. స్థానిక ధర్నా చౌక్ వద్ద గురుకుల ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ అధిక సంఖ్యల సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది. ఆరేళ్లు గడిచినా స్వంత భవనాలు నిర్మించలేదు. ఉపాధ్యాయులను తగినంత మందిని నియమించలేదు. ఉన్న ఉపాధ్యాయులపై భారం పడుతున్నది. బోధనేతర పనులతో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ సమస్యలను పరిష్కరించక పోవడంతో ఆందోళనా కార్యక్రమాలకు పూనుకున్నామని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని సొసైటీలో ఏకరూప పరిపాలన అమలు చేయాలి. అన్ని విద్యాలయాలకు స్వంత భవనాలు నిర్మించి మౌళిక వసతులు కల్పించాలి. టి ఎస్ ఆర్ ఈ ఐ ఎస్ ఎల్, ఎం జె పి టి బి సి డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్, l విద్యాసంస్థల్లో బోధనా సమయాన్ని అన్ని సొసైటీల మాదిరి 9:00 am నుండి 4:30 pm కు మార్చాలి. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలి. ప్రిన్సిపాల్ 100%, జూనియర్ లెక్చరర్, PGT పోస్టుల్లో
70% పదోన్నతులు ఇన్ సర్వీసు వారికి ఇవ్వాలి. ప్రతినెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలి. పారిటీ స్కేల్స్ అమలు చేయాలి. హెల్త్ కార్డులు జారీ చేయాలి. కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్లను నియమించి ఉపాధ్యాయులను నైట్ డ్యూటీల నుండి మినహాయించాలి. మానసిక ఒత్తిడి, పనిభారం తగ్గించాలి. ఆదివారం, పండుగ సెలవుల్లో విధులు నిర్వహించిన వారికి వీక్ ఆఫ్ ఇవ్వాలి. కాంట్రాక్ట్, గెస్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉపాధ్యాయులకు బేసిక్ పే చెల్లించి 12 నెలల కాలానికి వేతనం ఇవ్వాలని, CRT సర్వీసును రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి . రమేష్ మాట్లాడుతూ ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లకు, స్పాఫ్ నర్సులకు ప్రమోషన్ చానల్ కల్పించాలని, న్యూ ఫెర్ఫార్మెన్స్ అప్రయిజల్ పాలసీ (NPAP) ఆధారంగా రూల్ 28 అమలును రద్దు చేయాలి. 2007లో రెగ్యులర్ అయిన వారికి నోషనల్ సర్వీసు, పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలి. పెండింగు బిల్లులను చెల్లించాలి. సోసైటీ మారినా, ప్రభుత్వ సర్వీసు నుండి సొసైటికి వచ్చినవారికి పే ప్రొటెక్షన్ వర్తింపజేయాలి. గెస్ట్, పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు గురుకుల నియమకాల్లో వెయిటేజీ ఇవ్వాలి. బాలురు, బాలికల పాఠశాలల్లోని మహిళా ఉపాధ్యాయులకు కంబైన్డ్ సీనియారిటీ వర్తింపచేయాలని, ప్రతి పాఠశాలకు అదనంగా ఒక ఏఎన్ఎం ఇవ్వాలని, 2018, 2019 లో నియమకం అయిన ఉపాధ్యాయులకు సర్వీసు రెగ్యులరైజేషన్స్ ప్రాబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి. ప్రిన్సిపాల్ పోస్టును గ్రేడ్- 1 చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆగస్ట్ 5న ఛలో హైదరాబాదు కార్యక్రమానికి పూనుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మల్లేష్, ఉపాధ్యక్షులు సిరాజుద్దీన్, జిల్లా కార్యదర్శులు బాబులు, శ్రీనివాస్ తోపాటు గురుకుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.