నవతెలంగాణ – కంటేశ్వర్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఫ్) రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ డిమాండ్ చేశారు. నేడు స్థానిక జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అధిక సంఖ్యలో ఖాళీగా ఉండడంతో పాఠశాలల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడుతూ సబ్జెక్ట్ టీచర్స్ కొరత ఉండడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదని అన్నారు. పదోన్నతులు, బదిలీలు అనేవి కేవలం ఉపాధ్యాయులకు సంబంధించిన అంశం కాదని అది ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సంబంధించిన అంశం అని అన్నారు. పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను ఉద్యోగ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2011, 2012 మరియు 2015 నుండి ఒకే చోట పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారని వెంటనే బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని అన్నారు. 317 జి.ఓ. వల్ల స్థానికేతర జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలని పి ఎఫ్ ఆర్ డి ఏ (PFRDA) చట్టం రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ యు ఆర్ ఎస్ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న వారందరికీ బేసిక్ పే అమలు చేసి వారి సర్వీస్ ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల పని ఒత్తిడి తగ్గించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, అందరికీ ఒకే సమయ పాలన అమలు చేయాలని, ప్రమోషన్లు చేపట్టని సొసైటీ ల్లో ప్రమోషన్లనివ్వాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ టీచర్స్ బదిలీలు,పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ టీచర్స్ కి నెల నెల వేతనాలు చెల్లించాలని అన్నారు. అన్ని మేనేజ్మెంట్ పెండింగ్ బిల్లులను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు సిరాజుద్దీన్, స్వర్ణలత, జిల్లా కార్యదర్శులు రాజారామ్, సాయన్న, జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్, ప్రవీణ్, భూమేశ్వర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.