
గత రెండు సంవత్సరాలుగా ట్రెజరీల్లో ఆమోదం పొంది ఇ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. టిఎస్ యుటిఎఫ్ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలను సందర్శించిన చావ రవి ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. గత రెండేళ్ళుగా సెలవు జీతాలు, సప్లిమెంటరీ వేతనాలు, మెడికల్ బిల్లులు, జిపిఎఫ్, పెన్షన్, టిఎస్ జిఎల్ఐ తదితర బిల్లులు విడుదల కాకపోవడంతో ఉద్యోగులు, గత మార్చి నుండి రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మొత్తాలను చెల్లించకపోవడం వల్ల పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బకాయి పడిన నాలుగు వాయిదాల డిఎలు వెంటనే ప్రకటించాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి ఉద్యోగ సంఘాలతో చర్చించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిఒ 317 బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత విధానాన్ని కొనసాగించడం విచారకరమన్నారు. జిఒ 317 ను సవరించి బాధితులందరికీ న్యాయం చేయాలని రవి డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని, 2003 డియస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, రాష్ట్రంలో అన్ని జిల్లాలకు డిఈఒ, అన్ని మండలాలకు ఎంఈఒ పోస్టులను మంజూరు చేసి, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ఆరేళ్ళలో ఆదర్శవంతమైన పనితీరు కనబరిచిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని మరోసారి ఎమ్మెల్సీ గా గెలిపించాలని కోరారు. ఈ పర్యటనలో రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు, రాష్ట్ర నాయకులు డి కిరణ్ కుమార్, సృజన్ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పొడెం సమ్మయ్య, ఎటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహిపతి సంతోష్, టిఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి ములకాల వెంకటస్వామి, నాయకులు జి పురుషోత్తమ్, అల్లెం భాస్కర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.