– రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఎనుముల రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) అభినందనలు తెలిపింది. రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వం చేపట్టే చర్యలకు సంపూర్ణంగా సహకరిస్తామని ఆ సంఘం రాష్ట్ర అద్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సర్కారు విద్య బలోపేతానికి కృషి చేస్తుందని ఆశాభావం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలనీ, రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్స్ (రోసా) నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల గుర్తింపునకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని సూచించారు.
రేవంత్‌కు అభినందనల వెల్లువ
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. రేవంత్‌రెడ్డికి ఎస్టీయూ అధ్యక్షులు ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్, టీపీటీఎఫ్ అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి, డీపీటీఎఫ్ అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి, టీఎస్‌జీహెచ్‌ఎంఏ అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజు గంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి, సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షులు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు, ఎస్సీ,ఎస్టీటీఎఫ్ అధ్యక్షులు జాడి రాజన్న, ప్రధాన కార్యదర్శి మేడి చరణ్‌దాస్, బీహెచ్‌ఎస్‌ఎస్ అధ్యక్షులు గుండు కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధి కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తామని ప్రకటించారు.