డీఈఓను సస్పెండ్ చేయాలి: టీఎస్ యూటీఫ్ జిల్లా కార్యదర్శి వెంకన్న 

DEO should be suspended: TSUTF district secretary Venkannaనవతెలంగాణ – పెద్దవంగర

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల విషయంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎర్ర వెంకన్న, జిల్లా కోశాధికారి కొండు నాగ మల్లయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో డీఈవో ను సస్పెండ్ చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో సీనియారిటీ లిస్టును ఇష్టారీతిలో తయారుచేసి, అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం చేశారని ఆరోపించారు. డీఈవో కార్యాలయంలో తగినంత సిబ్బంది ఉన్నప్పటికినీ ఉపాధ్యాయులను అక్రమ డిప్యూటేషన్ పేరుతో పనిచేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవో చర్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా నాయకులు సోమారపు ఐలయ్య, మండల కార్యదర్శి చంద్రగిరి ప్రభాకర్, ఉపాధ్యాయులు నరేష్, చిరంజీవి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.