ప్రాంతాలు, యాజమాన్యాలు, క్యాడర్లు, కులాలు, మతాల అంతరాలను అధిగమించి రాష్ట్రంలోని ఉపాధ్యాయులం దరికీ ఒకే సంఘం ఉండాలనే ఆశయంతో చారిత్రక అవసరంగా 1974 ఆగస్టు 10న ఏర్పడిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీిఎఫ్) లక్ష్యాలు, ఆశయాల స్పూర్తితో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) పురోగమిస్తున్నది. హక్కులు బాధ్యతలు ఉద్యమ నేత్రాలుగా, అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో దశాబ్దకాలంగా సేవలందిస్తూ ఉపాధ్యాయుల మన్ననలు పొందుతూ పోరాట స్పూర్తితో ముందుకు సాగుతున్నది. 2014 ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లును పార్లమెంటు ఆమోదించి అపాయింటెడ్ డేట్‌గా జూన్2ను ప్రకటించినందున, 2014 ఏప్రిల్ 13న తెలంగాణ ప్రాంత పది జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యుటీఎఫ్) రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. 2014 సెప్టెంబర్ 24న రవీంద్రభారతిలో వేలాదిమంది ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా సదస్సు నిర్వహించి ఆనాటి విద్యామంత్రి, విద్యావేత్తల సమక్షంలో తెలంగాణ విద్యారంగంపై డాక్యుమెంటును విడుదల చేశారు. టీఎస్‌యూటీఎఫ్ డాక్యుమెంటులో ప్రస్తావించిన అంశాలే తదనంతర కాలంలో విద్యావేత్తల డిమాండ్లుగా మారటం విశేషం. విద్యారంగం అభివృద్ధి పట్ల ప్రభుత్వం వైపునుండి ఏ మాత్రం చొరవ లేకపోవటం చేత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించి, ప్రజలు కోరుకున్న విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలని, పిల్లలందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. పొందే హక్కు ప్రజలది. ‘ఊరి బడి బాగుకై కదలండి’ అంటూ 2015 జనవరి, ఫిబ్రవరి నెలల్లో తొమ్మిది జిల్లాల్లో 18 రోజులపాటు విద్యాయాత్ర నిర్వహించింది. ఆ యాత్ర ప్రజలపై మంచి ప్రభావం చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 5వేలకు పైగా గ్రామాల్లో తల్లిదండ్రులు ముందుకొచ్చి ఉపాధ్యాయుల సహకారంతో తమ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రారంభించుకున్నారు. అయితే ప్రభుత్వం ఆ పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులనుగానీ, తరగతి గదులను గానీ ఇవ్వకుండా వారి ఉత్సాహాన్ని నీరుగార్చింది.
నూతన రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ పాలకుల వర్గ స్వభావంలో మార్పు రానంతకాలం ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని, ఉపాధ్యాయులు వివిధ వర్గాల శ్రామికులు, సాధారణ ప్రజలతో మమేకమై ఐక్య ఉద్యమాలు, పోరాటాల ద్వారా మాత్రమే తమ హక్కులను సాధించుకోగలరని టీఎస్‌యూటీఎఫ్ విశ్వాసం. అందుకనుగుణంగా ముందుగా సంఘ నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూ ఇతర ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా సంఘాలతో ఐక్య కార్యాచరణను నిర్వహించింది.ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) ఏర్పాటులో, 57 ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికగా జెసిటియు ఏర్పాటు కావటంలో టీఎస్‌యూటీఎఫ్ చురుకైన పాత్ర పోషించింది. ఐక్య వేదిక పోరాట పిలుపుతోనే స్పాట్ వాల్యుయేషన్ రేట్లు రెట్టింపయ్యాయి. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరిగాయి. 2018 మే 16 న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులను ప్రగతి భవన్‌కు పిలిచి ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఐక్య ఉద్యమాల బలమేమిటో జెసిటియు రుజువు చేసింది.రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న తరుణంలో యుయస్పీసి, జాక్టో చొరవ తీసుకుని 79 సంఘాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదికను ఏర్పాటుచేసి 2020 మార్చి 13న చలో అసెంబ్లీ పోరాటాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించటంలోనూ, తదనంతరం పిఆర్సీ, పదోన్నతుల సాధన కోసం 2020 డిసెంబర్ 29న యూఎస్పీసీ, జాక్టో ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహణలోనూ టీఎస్‌యూటీఎఫ్ చురుకైన పాత్ర పోషించింది. కక్షసాధింపుగా ప్రభుత్వం యూఎస్పీసీ, జాక్టో నాయకులపై బనాయించిన అక్రమ కేసులో నేను కూడా ఉన్నాను.
పిఆర్సీ నివేదిక బయట పెట్టాలని పోరాటం, 7.5శాతం ఫిట్మెంట్ ఆమోదయోగ్యం కాదని చరిత్రలో తొలిసారి సచివాలయం ఎదుటే పిఆర్సీ నివేదిక ప్రతులను తగులబెట్టి నిరసన తెలపడం, త్రిసభ్య కమిటీ వద్ద పిఆర్సీ నివేదికలోని అసంబద్దాలను కూలంకషం గా వివరించి 30శాతం ఫిట్మెంట్ ప్రకటించాల్సిన అనివార్యతను ప్రభుత్వానికి కల్పించటంలో టీఎస్‌యూటీఎఫ్ క్రియాశీలక పాత్ర పోషించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు – 2018 అమలు సందర్భంగా ఏకపక్షంగా జీవో 317ను విడుదల చేసినప్పుడు స్థానికత పునాదులపై ఏర్పడిన తెలం గాణలో ఉద్యోగుల విభజనలో స్థానికతకు చోటులేకపోవటాన్ని ముందుగా ప్రశ్నించింది. యూఎస్పీసీ ఆధ్వర్యంలో పెద్దయెత్తున పోరాటం చేసింది. టీఎస్‌యూటీఎఫ్ రాజీలేని పోరాట పంథా పాలకుల ఆగ్రహానికి గురైంది. 2019 నుండి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు అదర్ డ్యూటీ సౌకర్యం నిలిపివేసినా, అక్రమ కేసులు పెట్టినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పత్రికల్లో వార్తలు రాసి బెదిరించినా భయపడలేదు. పాల కులకు సరెండర్ కాలేదు. నిరంతరం ఉపాధ్యాయుల పక్షాన నికరంగా నిలబడి పోరాడింది టీఎస్‌యూటీఎఫ్. వివిధ యాజమాన్యాల ఉపాధ్యాయుల సమస్యలపై సెక్టార్ వారీగా విభాగాలను ఏర్పాటు చేసి ఆయా ఉపాధ్యాయులను సంఘటితం చేసి ఉద్యమాలు నిర్వహించి కొన్ని ఫలితాలను సాధించింది. కోవిడ్ లాక్‌డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన పేదల కోసం రూ.50 లక్షలకు పైగా విరాళాలు సేకరించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. అఖిల భారత ఉపాధ్యాయ ఉద్యమంలో సైతం టీఎస్‌యూటీఎఫ్ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నది. సంఘ నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ, సైద్ధాంతిక నిబద్దతను పెంపొందించుకుంటూ ఈ ప్రస్థానాన్ని కొనసాగించడానికి టీఎస్‌యూటీఎఫ్ కార్యకర్తలందరూ పునరంకితమౌతున్నారు.
(నేడు టీఎస్‌యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం)
చావ రవి 9490300571