పాఠశాలలు, కళాశాలలకు ఉచితవిద్యుత్‌పై టీఎస్‌యూటీఎఫ్‌ హర్షం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామనీ, పాఠశాలల్లో సర్వీస్‌ పర్సన్స్‌ను నియమిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తూ టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సీఎం నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. 2008 డీఎస్సీ బీఈడీ అభ్యర్థుల ఉద్యోగాలపై 12న జరిగే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామనీ, జీవో 317 సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌కమిటీనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సంఘాలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తుందని సీఎం చెప్పటాన్ని స్వాగతిస్తున్నామని వారు చెప్పారు. సంఘాలుండాల్సిందేననీ, వాటితో మంత్రి వర్గ ఉపసంఘం చర్చించి అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని సీఎం భరోసా ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. సంఘాల గుర్తింపుపైనా నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు.