సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు– ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
– సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీ అలుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పాటుకు పాటుపడాలని కోరారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్‌ను రద్దు చేయాలనీ, పదోన్నతుల సంక్షోభాన్ని పరిష్కరించాలని సూచించారు. జీవో నెంబర్‌ 317 బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. వేతనాలు, బకాయిలు సకాలంలో చెల్లించాలనీ, ఉద్యోగుల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రుతూ లేఖను సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య చావ రవితోపాటు కోశాధికారి టి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు ఎ వెంకట్‌, ఎం రాజశేఖర్‌రెడ్డి, ఈ గాలయ్య ఎ సింహాచలం వై జ్ఞానమంజరి, పత్రిక ప్రధాన సంపాదకులు పి మాణిక్‌ రెడ్డి, మోడల్‌ స్కూల్‌ నాయకులు కొండయ్య, గురుకుల ఉపాధ్యాయ నాయకులు నర్సింహా, కేజీబీవీ రాష్ట్ర ప్రతినిధి విశాలాక్షి, రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్‌ నాయక్‌, వెంకటప్ప, రఘుపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
మోడల్‌ స్కూల్‌ సమస్యలను పరిష్కరించండి , సీఎం రేవంత్‌రెడ్డికి ఎంఎస్‌టీఎఫ్‌ నేతల వినతి
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఎంఎస్‌టీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు బి కొండయ్య మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. 2013లో యూపీఏ హయాంలో మోడల్‌ స్కూళ్లు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. కానీ నేటికీ అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సమస్యల పరిష్కారం చేయాలని సీఎంను కోరారు. దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ.. తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.