కేవీ టీచర్ల ఆందోళనకు టీఎస్‌యూటీఎఫ్‌ మద్దతు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రీయ విద్యాలయాల (కేవీ)ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆందోళనకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేవీ ఉపాధ్యాయులు, సిబ్బంది నూతన బదిలీ విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ, సిబ్బంది సంఘాలు కేవీపీఎస్‌ఎస్‌, ఏఐకేవీటీఏ, కేఈవీఐఎన్‌టీ ఎస్‌ఏలు ఐక్యంగా మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలపాలని నిర్ణయించాయని తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపటాన్ని కూడా సహించలేని కేవీ యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ ప్రిన్సిపాళ్లకు బెదిరింపు లేఖలు పంపటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కేవీ డిప్యూటీ కమిషనర్‌ ప్రిన్సిపాళ్లకు రాసిన అప్రజాస్వామిక లేఖలను ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిన నూతన బదిలీ విధానాన్ని పునః సమీక్షించాలని కోరారు.