కులాంతర వివాహిత జంటపై దాడి అమానుషం : కేవీపీఎస్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కులాంతర వివాహం చేసుకున్న జంటపై దాడి అమానుషమనీ, అందుకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కులాంతర వివాహం చేసుకున్న హరిప్రసాద్‌, రాజేశ్వరిలపై అమ్మాయి తల్లిదండ్రులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హరిప్రసాద్‌ కండ్లలో కారంకొట్టి రాజేశ్వరిని బలవంతంగా తీసుకెళ్లిన దుండగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వివాహం జరిగిన రోజే ఆ దంపతులు నల్గొండ డీఎస్‌పీని కలిసి రక్షణ కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురు తల్లి తండ్రులను పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించినప్పటికి ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. ఇద్దరూ మేజర్లు అయినప్పటికీ అబ్బాయి దళితుడు కావడంతో ఈ అగ్రకుల దూరహంకార చర్యకు పాల్పడ్డారని తెలిపారు. దాడి చేసిన వ్యక్తులపై హత్య నేరంతో పాటు ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు, కిడ్నాప్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ జంటకు పోలీసులు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని కోరారు.