నిరుపేదలు గృహ జ్యోతిని సద్వినియోగం చేసుకోవాలి: తులం ముత్తిలింగం

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గృహ జ్యోతి పథకాన్ని మండలంలోని ప్రజలు ముఖ్యంగా నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు తులం ముత్తిలింగం కోరారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలో గృహ జ్యోతి పథకం కింద నెలకు 200  యూనిట్ల లోపు కరెంటు వాడే వినియోగదారులకు జీరో కరెంట్ బిల్లు జారీ ప్రక్రియ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో ఆర్.రమాదేవి, ముత్తిలింగం చేతుల మీదుగా విద్యుత్ శాఖ సిబ్బంది లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గృహ జ్యోతి పథకంతో తెల్ల రేషన్ కార్డులు కలిగి అర్హులైన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఎవరికైనా ఇతర కారణాల వల్ల జీరో కరెంట్ బిల్లు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అలాంటి వారు మరలా తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని ఎంపీడీవో కార్యాలయంలో ధరఖాస్తు చేసుకుంటే ఈ నెల బిల్లును సైతం జీరో కరెంట్ బిల్లుగా మార్చి ఫోన్ నెంబర్ కి సందేశం పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది జగన్, పవన్, శివ, కె.శ్రీను, తదితరులు పాల్గొన్నారు.