తునికాకు సేకరణ టెండర్లు పిలవాలి 

– లక్షల మంది ఉపాధి కాపాడాలి 
–  టిఏజిఎస్ జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి 
నవతెలంగాణ -తాడ్వాయి
తునికాకు సేకరణకు టెండర్లు పిలవాలని టీఏజీఎస్ జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దుగ్గి చిరంజీవి మాట్లాడుతూ.. ప్రతిఏటా డిసెంబర్, జనవరి నుంచే సేకరణ ప్రక్రియకు సంబంధించిన పనులను అటవీశాఖ మొదలు పెట్టేదని, ఈ ఏడాది మాత్రం అ ప్రక్రియ నత్తనడక ను తలపిస్తున్నదన్నారు. టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి గిరిజన, గిరిజనేతర పేదలకు ఉపాధి కల్పించాలన్నారు. కొమ్మకొట్టుడు (పూనింగ్) ప్రక్రియను మొదలు పెట్టలేదు. టెండర్లను పూనింగ్ ప్రక్రియలను సకాలంలోచే పట్టకుంటే లక్షలాది మంది పేదల ఉపాధికి గండి పడే అవకాశముందని మండిపడ్డారు. తునికాకు సేకరణ పనుల జాప్యంతో దీనిపై ఆధారపడిన ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతరులు ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. ఫిబ్రవరి మొదటివారం నడుస్తున్నప్పటికీ, నేటికీ తునికాకు టెండర్లు పూర్తికాలేదు. లక్షలాదిమంది ప్రజల ఉపాధి దెబ్బతినే టట్లున్నది. ఈపాటికే పూసింగ్ పనులు చేపట్టాలని అన్నారు. ఎజెన్సీ ప్రాంతాల్లో, తునికాకు దొరికే ప్రాంతాల్లో,  కార్మికుల ఉపాధి కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెండర్లు నిర్వహించకపోతే, అటవీ శాఖ (ఫారెస్ట్ డిపార్ట్మెంట్) నేరుగా తునికాకు కొనుగోలు చేయాలని అన్నారు. ఈ రెండిటిలో ఏదో ఒకటి సత్వరమే నిర్ణయం తీసుకొని పది రోజుల్లో ప్రూనింగ్ పనులు ప్రారంభించాలని కోరారు.