పసుపు స్వచ్ఛమైనదేనా?

ప్రస్తుతం కల్తీ అనే పదం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చిన్న పిల్లలు తినే ఆహారం నుంచి అన్ని వస్తువుల్లో కల్తీ అవుతున్నాయి. ఇవి మాత్రమే కాదు, వంటింట్లో వినియోగించే మసాలా, కారం, నూనె, ఉప్పు, పప్పు అన్నీ కల్తీ చేస్తూ… ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. కల్తీ అవుతున్న వాటిల్లో పసుపు కూడా ఒకటి. కల్తీ పసుపును వినియోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్న చిన్న టిప్స్‌ పాటించటం ద్వారా అది కల్తీదో కాదో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నీటిలో పసుపు వేసి గుర్తించొచ్చు..
రెండు గ్లాసుల నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపు వేయాలి. అలా పసుపు వేసినప్పుడు నీరు లేత పసుపు రంగులోకి మారిపోయి.. మిగిలిన పసుపు గ్లాస్‌ అడుగు భాగాన చేరుకుంటుంది. ఇలా లేత పసుపు రంగులోకి మారిపోయి అడుగుభాగాన చేరితే అది అసలైన పసుపు అని నిర్ధారించాలని నిపుణులు చెబుతున్నారు.
అదే నకిలీ పసుపు అయితే.. గ్లాసులోని నీటిని పూర్తిగా, చిక్కగా మార్చేస్తుందని, పసుపు కూడా అడుగు భాగాన చేరదని చెబుతున్నారు. ఒకవేళ మీ పసుపు కూడా ఇలా చిక్కగా మారిపోతే అది నకిలీదని గుర్తించాలని, ఆ పసుపును వినియోగించకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.
పసుపు కొమ్ములు కూడా..
మార్కెట్‌లో లభించే పసుపు కల్తీదని గ్రహించిన కొందరు పసుపు కొమ్ములు కొంటున్నారు. అయితే ఈ పసుపు కొమ్ములను సైతం కల్తీ చేస్తున్నారు. పాడైపోయిన పసుపు కొమ్ము, తాజాగా కనిపించేందుకు వాటిని కలర్లు కలిపి మార్కెట్లో అమ్మేస్తున్నారు. అందుకే పసుపు కొమ్ములు కొనే వారు సైతం నకిలీ కొమ్ములు కొని మోసపోవద్దని, వాటిని గుర్తించి జాగ్రత్త పాడాలని నిపుణులు చెబుతున్నారు.
ఇందుకోసం రెండు గ్లాసుల నీరు తీసుకోవాలి. పసుపు కొమ్ములను ఆ నీటిలో ముంచినప్పుడు నీరు రంగు మారకపోతే అది అసలైన పసుపు కొమ్ము అని గుర్తించాలని చెబుతున్నారు. ఒకవేళ గ్లాసులోని నీరు రంగు మారితే.. నకిలీదని అర్ధం చేసుకోవాలని చెబుతున్నారు.