ఎదురు ‘తిరిగింది’

– పుణెలో భారత్‌కు స్పిన్‌ స్ట్రోక్‌
– తొలి ఇన్నింగ్స్‌లో 156 ఆలౌట్‌
– పట్టు బిగించిన న్యూజిలాండ్‌
– భారత్‌, న్యూజిలాండ్‌ రెండో టెస్టు రెండో రోజు
పుణెలో టీమ్‌ ఇండియాకు స్పిన్‌ స్ట్రోక్‌ తగిలింది. ప్రత్యర్థిని బిగించిన స్పిన్‌ ఉచ్చులో తనే పడిపోయి విలవిల్లాడుతోంది. కివీస్‌ స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ ఏడు వికెట్ల మాయజాలంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 103 పరుగుల భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది.
బంతితో భారత్‌ను దెబ్బకొట్టిన కివీస్‌.. బ్యాట్‌తో ఎదురుదాడి చేస్తోంది. టామ్‌ లేథమ్‌ (86) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కటంతో న్యూజిలాండ్‌ ఆధిక్యం 301 పరుగులకు చేరుకుంది. వాషింగ్టన్‌ సుందర్‌ (4/56), అశ్విన్‌ (1/64) మ్యాజిక్‌ మొదలెట్టినా.. పుణె టెస్టులో న్యూజిలాండ్‌ పట్టు బిగించింది. భారత్‌ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్‌ విజయానికి మరింత చేరువైంది!.
నవతెలంగాణ-పుణె
న్యూజిలాండ్‌ కోసం బిగించిన స్సిన్‌ ఉచ్చులో టీమ్‌ ఇండియా చిక్కుకుంది. పిచ్‌పై బంతి ఎదురు తిరగటంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ (7/53) ఏడు వికెట్ల మాయజాలంతో విజంభించగా.. సొంతగడ్డపై టీమ్‌ ఇండియాకు దిమ్మతిరిగింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (30, 60 బంతుల్లో 4 ఫోర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (30, 72 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), రవీంద్ర జడేజా (38, 46 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఎవరూ అంచనాలను అందుకోలేదు. రోహిత్‌ శర్మ (0), కోహ్లి (1), సర్ఫరాజ్‌ ఖాన్‌ (11), రిషబ్‌ పంత్‌ (18), అశ్విన్‌ (4) తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 45.3 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యం కోల్పోయింది. కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌ (86, 133 బంతుల్లో 10 ఫోర్లు), టామ్‌ బ్లండెల్‌ (30 నాటౌట్‌, 70 బంతుల్లో 2 ఫోర్లు) రాణించటంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 198/5తో కొనసా గుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ ఆధిక్యం 301 పరుగులు.
స్పిన్‌ మాయలో పడి..
యువ బ్యాటర్లు యశస్వి (30), గిల్‌ (30) రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. 49 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు. కానీ స్పిన్‌ మాంత్రికుడు మిచెల్‌ శాంట్నర్‌ మాయజాలం ప్రదర్శించాడు. దీంతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కుప్పకూలింది. గిల్‌ ఎల్బీ కాగా.. కోహ్లి ఫుల్‌టాస్‌ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో జడేజా (38) ఒక్కడే ప్రతిఘటించాడు. కాస్త వేగంగా పరుగులు సాధించాడు. దీంతో భారత్‌ 156 పరుగులైనా చేయగలిగింది. పంత్‌ (18) కాసేపు నిలిచినా.. ఆశించిన ఇన్నింగ్స్‌ ఆడలేదు. సర్ఫరాజ్‌ ఖాన్‌ సైతం విఫలమయ్యాడు. అశ్విన్‌ (4) ఆదుకోలేకపోయాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (18 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. 156 పరుగులకు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.
టామ్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌
తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసింది. కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌ (86) ముందుండి ఎదురుదాడి చేశాడు. భారత్‌ రెండు వైపులా స్పిన్‌ దాడి చేసినా లేథమ్‌ పరుగుల వేట సాగించాడు. పది బౌండరీలతో చెలరేగిన లేథమ్‌ అర్థ సెంచరీతో చెలరేగాడు. డెవాన్‌ కాన్వే (17), రచిన్‌ రవీంద్ర (9), డార్లీ (18) సహా లేథమ్‌ వికెట్లతో వాషింగ్టన్‌ సుందర్‌ మెరిసినా.. అప్పటికే న్యూజిలాండ్‌ కొండంత ఆధిక్యంలో నిలిచింది. టామ్‌ బ్లండెల్‌ (30 నాటౌట్‌) సైతం మెరవటంతో కివీస్‌ మరింత ఆధిక్యం దిశగా సాగుతోంది. నేడు మూడు రోజు ఆటలో కివీస్‌ కనీసం 50 పరుగులు చేసినా.. ఛేదనలో టీమ్‌ ఇండియాకు కష్టసాధ్యమైన లక్ష్యమే ఎదురు నిలువనుంది.
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 259/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (సి) మిచెల్‌ (బి) ఫిలిప్స్‌ 30, రోహిత్‌ (బి) సౌథీ 0, గిల్‌ (ఎల్బీ) శాంట్నర్‌ 30, కోహ్లి (బి) శాంట్నర్‌ 1, పంత్‌ (బి) ఫిలిప్స్‌ 18, సర్ఫరాజ్‌ (సి) ఓరౌర్క్‌ (బి) శాంట్నర్‌ 11, జడేజా (ఎల్బీ) శాంట్నర్‌ 38, అశ్విన్‌ (ఎల్బీ) శాంట్నర్‌ 4, వాషింగ్టన్‌ నాటౌట్‌ 18, ఆకాశ్‌ దీప్‌ (బి) శాంట్నర్‌ 6, బుమ్రా (ఎల్బీ) శాంట్నర్‌ 0, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్‌) 156.
వికెట్ల పతనం : 1-1, 2-50, 3-56, 4-70, 5-83, 6-95, 7-103, 8-136, 9-142, 10-156.
బౌలింగ్‌ : సౌథీ 6-1-18-1, ఓరౌర్క్‌ 3-2-5-0, అజాజ్‌ 11-1-54-0, శాంట్నర్‌ 19.3-1-53-7, ఫిలిప్స్‌ 6-0-26-2.
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : లేథమ్‌ (ఎల్బీ) వాషింగ్టన్‌ 86, కాన్వే (ఎల్బీ) వాషింగ్టన్‌ 17, యంగ్‌ (ఎల్బీ) అశ్విన్‌ 23, రచిన్‌ (ఎల్బీ) వాషింగ్టన్‌ 9, డార్లీ (సి) జైస్వాల్‌ (బి) వాషింగ్టన్‌ 18, బ్లండెల్‌ నాటౌట్‌ 30, ఫిలిప్స్‌ నాటౌట్‌ 9, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (53 ఓవర్లలో 5 వికెట్లకు) 198.
వికెట్ల పతనం : 1-36, 2-78, 3-89, 4-123, 5-183.
బౌలింగ్‌ : అశ్విన్‌ 17-1-64-1, వాషింగ్టన్‌ 19-0-56-4, జడేజా 11-1-50-0, బుమ్రా 6-1-25-0.