పొంగులేటి..మెలికపెట్టి

– 12 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌కు షరతు
– భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరపైనా పట్టు
– కంటోన్మెంట్‌ కూడా కావాలె
– ఖమ్మం పార్లమెంట్‌లో పోటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ వేటు తర్వాత బీజేపీ గడప తొక్కాలా? కాంగ్రెస్‌ గూటికి చేరాలా? సొంత పార్టీ పెట్టాలా? అనే దానిపై చర్చోపచర్చల తర్వాత హస్తం పార్టీవైపే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. బీజేపీలోకి వెళ్తే వెంట నడిచేదేలేదంటూ ఆయన అనుచరగణం తెగేసి చెప్పటంతో కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు సూత్రపాయంగా తెలిసింది. 11 అసెంబ్లీ సీట్లు, ఖమ్మం పార్లమెంటరీస్థానం తాను చెప్పినోళ్లకు ఇవ్వాలని మెలికపెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్‌ ఎల్పీ నేత అయిన భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర సీటూ తనకు వదిలేయాలని పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ పరిధిలోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానాన్ని కూడా తాను చెప్పినోళ్లకు ఇవ్వాలని షరతు పెట్టారని ప్రచారం జరుగుతున్నది. ఆయన ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వం, ఇటు రాష్ట్రంలో రేవంత్‌రెడ్డితో సమాలోచనలు చేసినట్టు తెలిసింది. పొంగులేటి గొంతమ్మ కోరికలు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో నిప్పును రాజేశాయి. ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.పొంగులేటికి ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో సొంత క్యాడర్‌ ఉంది. అయితే, ఆయన పార్టీమారినంత మాత్రానా అందరూ తన వెంటే వస్తారనే గ్యారంటీ లేదు. ఖమ్మం జిల్లా జెడ్పీ చైర్మెన్‌గా ఉన్న లింగాల కమల్‌రాజు పొంగులేటికి ముఖ్య అనుచరుడనే పేరుంది. బీఆర్‌ఎస్‌ను వీడుతానంటే కలిసి రానని ముందే స్పష్టంగా చెప్పేశారు. దీనిని బట్టే అందరూ ఆయన వెంట వెళ్లరని స్పష్టమవుతున్నది. బీజేపీలో చేరాలనుకున్న ఆయన నిర్ణయాన్ని అనుచరులు, కార్యకర్తలు నిర్ద్వంధంగా తిరస్కరించిన విషయం విదితమే. ఆ తర్వాత ఆయన కొత్త పార్టీ పెడతారనే మరో పుకారు షికారు చేసింది. అదీ పారలేదు. ఇప్పుడు కొత్త పార్టీకి స్కోప్‌ లేదనే విషయాన్ని పసిగట్టిన పొంగులేటి చేయి నీడన చేరాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఎలా ఉన్నా కాంగ్రెస్‌ ముందు పెట్టిన డిమాండ్లే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమతంటా బీఆర్‌ఎస్‌ గాలి వీచినా…అంత కష్టసమయంలోనూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నెగ్గుకొచ్చింది. పైచేయి సాధించింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి గెలిచినవాళ్లు బీఆర్‌ఎస్‌లో చేరినా క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఇంకా పట్టు సడలలేదు. ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్‌ నాయకులు తమ శాయశక్తులా పనిచేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ తన అనుచరులకే సీట్లు ఇవ్వాలని కోరటం, భట్టి స్థానంపైనా పట్టుబట్టడం అగ్గిని రాజేసింది. దీనిపై మల్లు భట్టి విక్రమార్క, రేణుక చౌదరితోపాటు ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు భగ్గుమంటున్నారు. పొంగులేటికి తనది బలమో, వాపో అర్ఠం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇష్టపడి పార్టీలో చేరకుండా సవాలక్ష షరతులు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాను ఆయనకు అప్పగిస్తే… ఇప్పటిదాకా పార్టీని నమ్ముకుని ఉన్న వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రశ్నించేందుకు సన్నద్ధం అవుతున్నారు. పొంగులేటి తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడం కోసం పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించడం సరైందికాదని హెచ్చరిస్తున్నారు. పొంగులేటి డిమాండ్లకు తలొగ్గితే ఖమ్మంలో పార్టీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు. పొంగులేటి పార్టీలోకి రాకపోయినా బీఆర్‌ఎస్‌ ఢకొీట్టి మరీ గెలిచేందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.