– టీపీసీసీ అధికార ప్రతినిధి కూడా ట్వీట్
– బీజేపీ ఎంపీ, మాజీ ఎంపీ కూడా కాంగ్రెస్‌లోకి అంటూ..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ‘ఐక్యంగా ముందుకెళ్లండి..నేతల మధ్య ఆధిపత్యపోరు లేకుండా పనిచేస్కోండి.. తెలంగాణలో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిపించండి’ అని మందలించి అమిత్‌షా ఇలా ఢిల్లీకి వెళ్లారో లేదో ఆ పార్టీలో మళ్లీ కవలవరం మొదలైంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతున్నది. ‘త్వరలో కాంగ్రెస్‌లోకి తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి!’ అంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. ఎక్స్‌లో కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అకౌంట్‌లోనూ ‘పొలిటికల్ బ్రేకింగ్..ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన, బీజేపీ సీఎం అభ్యర్థి కాంగ్రెస్‌లోకి రాబోతున్నారు’ అంటూ 6 టైమ్స్‌లో ‘ఈ’ అనే అక్షరాన్ని ప్రత్యేకంగా కోడ్స్ పెట్టి హైలెట్ చేయడం కూడా ఈటలనుద్దేశించే అని ప్రచారం జరుగుతున్నది. ఇది బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని కలవరపడుతున్నది. ఈటలతో పాటు బీజేపీకి చెందిన ఓ ఎంపీ, మరో మాజీ ఎంపీ కూడా పువ్వు పార్టీని వీడి హస్తం గూటిలో చేరబోతున్నారని గాంధీభవన్ నుంచి లీకులు వస్తుండటంతో బీజేపీ అధిష్టానం అలర్ట్ అయ్యి వారిని బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టినట్టు తెలిసింది.