విశ్వవిద్యాలయాల పరిశోధనా పుటల్లో ‘తొలి’ అన్నచోట ‘తెలంగాణ బతుకమ్మ పాటలు- సామాజిక, సాంస్కృతిక భాషా పరిశీలన’ అంశంపై తొలి పరిశోధన చేసిన పరిశోధకురాలు డా. బండారు సుజాతా శేఖర్. రచయిత్రి, కవయిత్రి, సినీ గేయకర్త, పరిశోధకురాలుగా అందరికీ తెలిసిన పేరు ఈమెది. 16 సెప్టెంబర్, 1965న నల్లగొండ జిల్లా దేవరకొండలో పుట్టారు. వృత్తిరీత్యా ఆంగ్లోపాధ్యాయినిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. శ్రీమతి బండారు అనసూయమ్మ- పెద్ద మల్లయ్య అమ్మానాన్నలు. ఓపెన్ స్కూల్ స్టేట్ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు. పాఠ్య పుస్తకాల రచనలో పాల్గొన్న సుజాత తెలుగు, ఆంగ్లంతో పాటు ఇతర విషయాల పుస్తక రచనలోనూ భాగస్వామయ్యారు. రాష్ట్ర వనరుల కేంద్రం, దూరదర్శన్, దూరవిద్య, మనటీవి. టిసాట్, సైట్ వంటి సంస్థల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్.ఆర్.ఐలు ప్రచురించిన తెలుగు వాచకాల రూపకల్పనలోనూ భాగస్వాములుగా వున్నారు.
రచయిత్రిగా పన్నెండు పుస్తకాలు అచ్చువేశారు. వాటిలో ‘కవితా పుష్పం’ కవితా సంపుటి, ఆకాశవాణి మల్లెలు మందారాలులో ప్రసారమైన కవితల సంపుటి ‘సౌజన్య శిఖరాలు’, ‘మట్టి గీతం’ మహోజ్జ్వల గీతం పేరుతో అచ్చయిన దీర్ఘకవిత, ‘మనసు పాడింది’ లలిత గీతాలు, ‘వాసవి గేయమాల’ భక్తి గీతాలు కవిత్వ రచనలు. ఇంకా ‘విశ్వనరుడవు’ సహజ శతకం, ‘జొన్న కంకులు’ నానీలు, ‘దేవరకొండ గాంధీ కొండలరావు జీవిత చరిత్ర’, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమి కోసం రాసిన స్వాతంత్య్ర సమరయోధులు ‘కె.సి.గుప్త జీవిత చరిత్ర’ వీరి ఇతర రచనల్లో కొన్ని. ‘బతుకమ్మ’ సినిమా కోసం సుజాత పాటలను అందించారు. కథలు సంకలనాల్లో అచ్చయ్యాయి. ‘తాలి ఎగతాలి’, ‘అబార్షన్ బేబి’ ఈమె నవలలు. తెలంగాణ జాగృతి పురస్కారం మొదలు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం వరకు మూడు పదులకు పైగా అవార్డులు, తెలంగాణ ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం కూడా సుజాత అందుకున్నారు. అధికార భాషా సంఘం, వినియోగదారుల ఫోరం, జిల్లా న్యాయ సలహా సంఘం, శాంతి కమిటి వంటి సంస్థల్లో క్రీయశీలక సభ్యులుగా సేవలందించారు.
1998 ప్రాంతంలో పిల్లల కోసం రచనలు ప్రారంభించిన సుజాత తొలుత బాలల కోసం కథలు రాశారు. ఆ కథలన్నీ 1999 నుండి 2002 వరకు ‘బాల తేజం’తో పాటు ఇతర పత్రికల్లో వచ్చాయి. బాలతేజంలో ఎక్కువ మొత్తంలో వీరి రచనలు రావడం విశేషం. ఇదే పత్రికలో సెప్టెంబర్ 2000 సంచికలో వచ్చిన ‘స్నేహం’ కథ నాకు జ్ఞాపకం. కథలోని ఊరు అందాలపురం, అందమైన పూలతోట, అందులో అందమైన పూల మధ్య కూడిన అందమైన స్నేహం గురించి రాసిన అందమైన కథ యిది. నాకు బాగా నచ్చడానికి కారణం ఇరవైయేండ్ల క్రితమే నీతులు, సూక్తులతో కాకుండా చక్కని సమన్వయాన్ని కూర్చి రాసిన కథ యిది కావడం. ఇంకా ‘అపాయం’, ‘అమ్మఒడి’ వంటి మరికొన్ని మంచి కథలు కూడా ఈమె రచనల్లో చూడొచ్చు. ‘ఆంటీ కబుర్లు’ పేరుతో చాలా కాలం పాటు బాలతేజంలో పిల్లల కోసం శీర్షికను నిర్వహించారు సుజాత. ప్రతి సంచికలో ఒక విషయాన్ని తీసుకుని దానిని ముచ్చటగా ‘పిల్లలూ!’ అంటూ పిల్లలకు పరిచయం చేయడం ఈ శీర్షిక లక్ష్యం. అయితే దీనికి కబుర్లు అని పేరుపెట్టినా విషయానుగుణంగా, ప్రతిచోట ఏదో ఒక కథను అందంగా, అత్యంత క్లుప్తంగా చెప్పడం చూడవచ్చు. క్లుప్తత అటు కబుర్లకు, ఇటు కథలకు వన్నె తెచ్చింది కూడా! అనేక విషయాలను పిల్లలతో చర్చించారు.
సుజాతా శేఖర్ ఎంత చక్కగా పాటలు పాడతారో అంతే చక్కగా రాస్తారు. పాఠ్యపుస్తకాల కోసం చక్కని పాటలు రాశారు. మూడవ తరతి తెలుగు వాచకంలోని ‘ఉయ్యాలండీ! ఉయ్యాల!/ ఊహల పల్లకి ఉయ్యాల!/ ఉల్లాసంగా మనమంతా/ ఊగుదమండి రారండి!/ అందాలొలికే జాబిల్లి/ అందుకు మనకు ఊహల్లో…’ పాటను జన విజ్ఞాన వేదిక ఆడియోగా రూపొందించగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రమంతా ఈ పాట మారుమోగింది. పిల్లలకోసం ఈమె ప్రచురించిన బాల గేయాల సంపుటి ‘తేనె చినుకులు’. ‘చదువంటే విజ్ఞానం/ చదవంటే సంస్కారం/ విజ్ఞానపు లోగిలిలో/ వికసించును సంస్కారం’, ‘అమ్మ అన్న కమ్మని – ఆ పిలుపే చాలులే/ అమృతం తాగిన – అనుభూతి గొలుపులే’ వంటి చక్కని గేయాలు తేనె చినుకుల్లో చూడవచ్చు. ఇంకా ‘ఆశయాల అంచులతో కదిలింది నవతరం/ సమతా మమతల కోసం సాగింది యువతరం’ అంటూ స్ఫూర్తినిచ్చే గేయాలతో పాటు ‘చీకటిని చీల్చేటి తొలి క్రాంతివై/ కదలిరార! కదలిరార చైతన్య దీప్తివై’ అన్న చైతన్య గీతాలనూ రాశారు. ‘గత చరిత్ర ఏదైనా/ ఈ చరిత్ర నీదేరా’ అని బోధించిన సుజాత ‘..నిండుగా పాడుదాం తెలుగుపాట/ గుండెనిండ నింపుదాం తెలుగుభాష’ అని ఎలుగెత్తారు. చెట్లు, బాలలు, తుమ్మెదలు, ఆడపిల్లల గురించి గేయాలు రాశారు. ‘రత్నగర్భ భారతం/ రంజిల్లే సౌరభం/ నవసుమాలు వెదజల్లు/ హరితరజిత నందనం’, ‘ఆటంటే, పాటంటె/ భలే ఇష్టం, మాకు భలే ఇష్టం’ అని బాలల పక్షాన వకాల్తా తీసుకుని చెప్పారు గేయంలో. బతుకమ్మపై ఎలా పరిశోధన చేశారో అట్లానే పిల్లల కోసం పాటలు, కథలు రాశారు. నల్లగొండ బంగారం’ ఈ సుజాతా శేఖర్. జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్
9966229548