– పోలింగ్ విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగి మృతి
నవతెలంగాణ – అశ్వారావుపేట/ఉప్పల్
పోలింగ్ రోజు సోమవారం పలుచోట్ల విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఓటేయ్యడానికి వచ్చి కుప్పకూలి గుండెపోటుతో ఇద్దరు ఓటర్లు మృతిచెందారు. ఒక ఉద్యోగి విధులు నిర్వర్తిస్తూ చనిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో మృతుడు పోలూరు శ్రీకృష్ణ సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఎన్నికల విధుల్లో బాగంగా అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అశ్వారావుపేట మండలం, పేరాయిగూడెం పంచాయతీ, నెహ్రూ నగర్ పోలింగ్ బూత్ 165లో పోలింగ్ ఆఫీసర్‌గా వచ్చాడు. సోమవారం విధులు నిర్వహిస్తూ ఉదయం 10.30 గంటలకు అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. స్పందించిన సిబ్బంది హుటాహుటిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆస్పత్రికి చేరే లోపే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేదు. మాయోకార్డియో ఇస్కీమియా కారణంతో మృతి చెంది ఉంటారని సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ విజరు కుమార్ తెలిపారు. భద్రాద్రి జెడ్పీ చైర్మెన్ కే.చంద్రశేఖర్ సంతాపం తెలిపారు.
నడుస్తూనే…
అశ్వారావుపేట మండలం వేదాంత పురం పంచాయతీకి చెందిన కాశీ నాగేశ్వర రావు (55) వాగొడ్డుగూడెంలోని 173 పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ఇంటి నుండి బయలు దేరాడు. అదే గ్రామాల్లోని ఓ దేవాలయం దగ్గరకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన మాజీ సర్పంచ్ సోనీ శివశంకర్ ప్రసాద్ హుటాహుటిన ఆటోలో అశ్వారావుపేట ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చూసి మార్గం మధ్యలోనే మృతి చెంది ఉంటాడని తెలియజేయడంతో భౌతిక కాయాన్ని అదే ఆటోలో ఆయన ఇంటికి తరలించారు.
పోలింగ్ కేంద్రంలో గుండె పోటుతో వృద్దురాలు మృతి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్దురాలు పోలింగ్ కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ ఓల్డ్ భరత్‌నగర్‌కు చెందిన గట్టు విజయలక్ష్మి (65) సోమవారం ఓటు వేసేందుకు కాలనీలోని మసీదు వద్ద ఉన్న బూతు నెంబర్ 349 వద్దకు వచ్చింది. అక్కడ ఆమె ఓటు వేసి బయటకు వస్తుండగా ఎండవేడిమికి తట్టుకోలేక అకస్మాత్తుగా గుండెపోటు కుప్పకూలి స్పహ కోల్పోయింది. దాంతో విజయలక్ష్మిని హుటాహుటిన స్థానికులు, పోలీసులు స్థానిక టీఎక్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ విషయమై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే పోలింగ్ కేంద్రం వద్ద ఆమె తనకు దాహం వేస్తుందని పోలీస్, ఎన్నికల సిబ్బందికి చెప్పినా వారు తాగునీరు అందించలేదని, అందుకే ఎండ వేడిమికి తాళ లేక మృతి చెందిందని బాధిత బంధువులు, స్థాని కులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండా రి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మందముల్ల రజిత పరమేశ్వర్ రెడ్డి సంఘటన స్థలానికి రావాలని డిమాండ్ చేశారు. మహిళ మృతికి పోలీస్, ఎన్నికల అధికారులు బాధ్యత వహించాలని, బాధితురాలు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.