– బాలాజీనగర్‌లో విషాదం
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని బాలాజీ నగర్‌లో ఇద్దరు చిన్నారులు నీటి సంపులో పడి మృతి చెందడంతో విషాదం చోటుచేసుకుంది. ఏనుమాముల పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన కరుణం బలేశ్వరి, రవికుమార్ దంపతులు.. తమ పిల్లలు శౌర్య తేజ (4), తేజస్విని(2)తో కలిసి మేడారం జాతర సందర్శన కోసం శుక్రవారం బయలుదేరారు. ప్రయాణంలో అలసిపోవడంతో బాలేశ్వరి తన కుటుంబంతో సహా శుక్రవారం సాయంత్రం తన తల్లి గారి ఊరైన బాలాజీ నగర్‌కు చేరుకున్నారు. ప్రయాణంతో అలిసిపోయిన దంపతులు నిద్రపోయా రు. కాగా, శనివారం మేడారం జాతరకు వెళ్లవలసి ఉండగా తల్లిదండ్రులు నిద్రలేచి చూడగా పిల్లలు కనిపించకపోవడంతో అంతా వెతికి చుట్టుపక్కల వారిని అడిగారు. చివరకు ఇంటి ముందున్న నీటి సంపులో చూడగా పిల్లలిద్దరూ విగత జీవులుగా కనిపించడంతో వారి రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులిద్దరూ గాఢ నిద్రలో ఉండి పిల్లలను ఎవరూ పట్టించుకోవడంతో వారు ఆడుకుంటూ సంపులో పడినట్టుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, సమాచారం అందుకున్న ఏనుమాముల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.