ప్రమాదవశాత్తు చెరువులో పడి.. ఇద్దరు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి.. ఇద్దరు మృతి– సాలూర క్యాంప్‌ గ్రామంలో విషాదఛాయలు
నవతెలంగాణ-బోధన్‌
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా సాలూర మండలంలోని కుమ్మన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బోధన్‌ రూరల్‌ ఎస్‌ఐ నాగనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సాలూర క్యాంప్‌ గ్రామానికి చెందిన గాదే మనోజ్‌రెడ్డి (22), మనోజ్‌ కుమార్‌ (22) యువకులిద్దరూ స్నేహితులు. ఎప్పటిలాగే ఇద్దరూ కలిసి శనివారం సాయంకాలం నడకలో భాగంగా కుమ్మన్‌పల్లి చెరువు వైపు వెళ్లారు. అక్కడ వారి కాళ్లకు బురద అంటుకోవడంతో కడుక్కోవడానికి చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డారు. ఈ క్రమంలో వారికి ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయారు. వారిద్దరూ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. వారి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం చెరువు వైపు వెళ్ళిన స్థానికులకు మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. దీంతో వారు బోధన్‌ రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గజ ఈతగాళ్ల సహాయంతో వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చేతికందివచ్చిన కుమారులు ఇలా ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఇరు కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాగనాథ్‌ తెలిపారు.