చెరువులో పడి ఇద్దరు మృతి

– నిజామాబాద్‌ జిల్లా మంచిప్పలో ఘటన
నవతెలంగాణ-మోపాల్‌
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతిచెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని మంచిప్ప గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ యాదగిరి గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు మంచిప్ప గ్రామంలోని దర్గా వద్దకు ప్రత్యేక ప్రార్థనల కోసం ఆదివారం వచ్చారు. ప్రార్థనల అనంతరం వారిలోని ఇద్దరు యువకులు యాకూబ్‌ (32), సయ్యద్‌ వాసిక్‌ (34) సరదాగా అక్కడే ఉన్న పెద్ద చెరువు వద్దకు వెళ్లి నీటిలో దిగి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు చెరువులోకి దిగి గాలించగా.. యాకూబ్‌ మృతదేహం లభించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. రెస్క్యూ టీమ్‌తో ఘటనా స్థలానికి చేరుకొని గాలించి వాసిక్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన వాసిక్‌ ప్రముఖ కరాచీ బేకరీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అలాగే యాకూబ్‌ ఓ ప్రముఖ మొబైల్‌ షాపులో పనిచేస్తున్నాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.