జమ్ము కాశ్మీర్ శాసనసభ ఎన్నికల ఫలితాలకు గొప్ప ప్రాధాన్యత వుంది. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంలోని కూటమి తొంభై స్థానాలలో 49 గెలుచుకోవడం మోడీ ప్రభుత్వంపైన, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి దాని ప్రత్యేక ప్రతిపత్తిని లేకుండా చేసిన దాని నిరంకుశ చర్యల పైన పెద్ద విజయం. తమ తరపున బినామీ శక్తులను రంగంలోకి దించి వేర్పాటువాద శక్తులను ప్రోత్సహించి ఓట్లను చీల్చాలనే బీజేపీ ఎత్తులను కూడా కాశ్మీర్ లోయలో ప్రజలు వమ్ము చేశారు. లోయలో బీజేపీకి 2.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయంటే కాశ్మీర్ ప్రజల అస్తిత్వాన్ని నాశనం చేసేందుకు హిందూత్వ శక్తులు ఆడిన నాటకాన్ని వమ్ము చేశారని అర్థం. అదే సమయంలో జమ్మూలో బీజేపీ (గతం కంటే మూడు అదనంగా తెచ్చుకుని) 29 స్థానాలతో విజయం సాధించడం, కాంగ్రెస్ కేవలం ఒక సీటు మాత్రమే తెచ్చుకోవడం చూస్తే జమ్ము కాశ్మీర్‌లోయ మధ్య మతపరమైన విభజన మరింత తీవ్రమైందని తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం జమ్మూ ప్రాంత ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడం, చోటు కల్పించడం ఎలాగన్నది పెద్ద సవాలుగానే ఎదుర్కొనవలసి వుంటుంది.
ఒమర్ అబ్దుల్లాకు సవాళ్లు
ఒమర్ అబ్దుల్లా నాయకత్వంలో ఏర్పడే నూతన ప్రభుత్వం తీవ్ర అవరోధాల మద్య పని చేయవలసి వుంటుంది. ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వంగా శాసనసభగా పనిచేయాల్సి వుంటుంది. జమ్ము కాశ్మీర్ గవర్నర్ విస్తారమైన అధికారాలు చలాయించ బోతున్నారు. జమ్ము కాశ్మీర్ పునర్విభజన చట్టం నిబంధనలకు సవరణలు చేయడం ద్వారా ఈ అధికారాలను మరింత బలోపేతం చేశారు. కాశ్మీర్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం లాంటి పరిస్థితినే ఎదుర్కొనవలసి వస్తుంది. జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని వెంటనే పునరుద్ధరించుకునే పోరాటక్రమంలో ప్రభుత్వ ఏర్పాటు మొదటి మెట్టుగా చూడాల్సి వుంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం పెత్తనం చేసే విధానాన్ని అడ్డుకోవాలంటే పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరణ వల్ల మాత్రమే బాట ఏర్పడుతుంది.
హర్యానాలో ఊహించని ఫలితాలు
హర్యానాలో బీజేపీ విజయం ఊహించనిదే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మొగ్గు వుందనే అభిప్రాయం విస్తారంగా వుండింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ ఆ పార్టీనే విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ తీరా చూస్తే కాంగ్రెస్ కేవలం 37 మాత్రమే తెచ్చుకోగా బీజేపీ 48 స్థానాలతో విజయం సాధించింది. బీజేపీకి 39.9 ఓట్ల శాతం రాగా కాంగ్రెస్ 39.3 ఓట్ల శాతం వచ్చింది. అంటే తేడా కేవలం 0.6 శాతం మాత్రమే వుంది. ఆప్‌కు 1.8 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో చూస్తే కాంగ్రెస్ ఆప్, సమాజ్‌వాది పార్టీలతో సీట్ల సర్దుబాటు కుదుర్చుకోలేకపోయిన ప్రభావం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. బీజేపీ జాట్ యేతర కులాల కూటమి మద్దతు కూడగట్టడంలో ఫలప్రదమైనట్టు కనిపిస్తుంది. భూపేందర్ సింగ్ హుడా నాయకత్వం కారణంగా కాంగ్రెస్ జాట్ యేతర కులాలను ఆకట్టుకునేలా విశాలంగా ఆకర్షించలేక పోయింది. ముఠా తగాదాలు, అనైక్యత కూడా కాంగ్రెస్ దెబ్బ తినడానికి కారణమైంది. బీజేపీ, ఆరెస్సెస్‌లు మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఓ క్రమపద్ధతిలో సాగించిన మతపరమైన ప్రచారం కూడా ఇందుకు కారణమైందనే విషయం అంతగా గమనంలోకి రావడం లేదు. ఈ ప్రచారాలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ దాదాపుగా విఫలమైంది. హర్యానాలో బీజేపీ విజయం హిందూత్వ శక్తులకు మరింతగా కొమ్ములు తెస్తుందనడంలో సందేహం లేదు.
మరింత ధృఢంగా ముందుకు..
బీజేపీ కేంద్రంలో మెజార్టీ తెచ్చుకోవడంలో ఎదురుదెబ్బ తిన్నప్పటికీ..హిందూత్వ కూటమి ఓట్లను కూడగట్టడంలో దాని బలాన్ని ఎంతమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదని లోక్‌సభ ఎన్నికల తర్వాత సీపీఐ(ఎం) హెచ్చరించింది. బీజేపీ, ఆరెస్సెస్ భావజాలం పైన, రాజకీయాల పైన నిరంతరాయంగా పోరాటం సాగించేలా వామపక్ష, లౌకిక, ప్రజాస్వామిక శక్తుల సంకల్పాన్ని హర్యానా ఎన్నికల ఫలితాలు మరింత ధృఢతరం చేయాలి.
(అక్టోబరు 9 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)