ఎయిర్‌పోర్టులో ఇద్దరు విదేశీయుల అరెస్టు

నవతెలంగాణ-శంషాబాద్‌
విదేశాల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ఇద్దరు విదేశీయులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించా రు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌ దేశానికి చెందిన మైత్రి బారువ, అంకోన్‌ బారువ.. రహస్యంగా భారతదేశంలోకి ప్రవేశిం చారు. ఇందులో మైత్రి బారువ బంగ్లాదేశ్‌ దేశం నుంచి కలకత్తాలోకి ప్రవేశించి.. సర్కార్‌రాజ్‌ అనే మారుపేరుతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పాస్‌పోర్ట్టు తీసుకున్నారు. మరో వ్యక్తి అంకోన్‌ బారువ.. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా త్రిపురలోని అగర్తలలో ప్రవేశించి.. దీపాంకర్‌ సర్కార్‌ అనే పేరుతో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్‌పోర్ట్టు, వీసా తీసుకున్నారు. వీరిద్దరూ వేరు వేరు ప్రాంతాల నుంచి దేశంలోకి వచ్చారు. హైదరాబాద్‌ నుంచి సులువుగా థాయి లాండ్‌ చేరుకోవాలన్న ఉద్దేశంతో నకిలీ పాస్‌పోర్టులతో వీసా దరఖాస్తు చేసుకు న్నారు. ఆ వీసాతో హైదరాబాద్‌ మీదుగా థాయిలాండ్‌ వెళ్లడానికి హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఏయిర్‌పోర్టులో ఇమ్మి గ్రేషన్‌ అధికారులు వారి పాస్‌పోర్టు, వీసాలను పరిశీలించగా.. అవి నకిలీవని తేలడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.