నవతెలంగాణ – నెక్కొండ
వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు వాటాల పంపకంలో తలెత్తిన వివాదంలో ఘర్షణ పడి కొట్టుకున్న ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడింది. ఓ కేసు విషయంలో లంచం తీసుకుని సమానంగా పంచుకునే వివాదంలో గొడవ పడినట్లు తెలుస్తోంది. అయితే ఓ హెడ్ కానిస్టేబుల్ పంపకాల్లో అధిపత్యం చెలాయించడంతోనే ఇరువురి మధ్య సమస్య తలెత్తింది. లంచం పంపకాల్లో తేడా రావడంతో ఆగ్రహించిన మరో హెడ్ కానిస్టేబుల్ తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఘర్షణకు దారితీసింది. మాట మాట పెరిగి విచక్షణ కోల్పోయి సీసీ కెమెరాలు ఉన్నాయనే సోయి మరిచి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. కాగా స్థానిక ఎస్సై మహేందర్ సెలవుపై వెళ్ళగా అతను అందుబాటులో లేకపోవడంతో సీఐ చంద్రమోహన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా లంచం పంపకాల కోసం కొట్టుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో విచారణ అనంతరం ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు మోహన్, సోమ్ల నాయక్ పై బదిలీ చేస్తు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు