ఉపాధి కూలీలకు రెండు వందల రోజుల పని కల్పించాలి

– అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సారా సురేష్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కనీసం రెండు వందల రోజుల పని కల్పించాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సారా సురేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మండలంలోని  నాగపూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలతోని జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన  అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సారా సురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు కనీసం 200 రోజుల పని కల్పించాలన్నారు. మండుటెండలో కూలీలు పనిచేస్తున్నందున  పనిచేస్తున్న ప్రదేశంలో టెంటు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. అదేవిధంగా ప్రతి  వారం కూలీలకు డబ్బులు చెల్లించాలని, కొలుతలతోని పని లేకుండా రోజు కూలి రూ.380 ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోతలు విధించడాన్ని వ్యతిరేకించాలన్నారు.ఉపాధి కూలీలకు పని కల్పించాల్సింది పోయి ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఉపాధి హామీ నిధుల్లో కోత విధిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో కోత విధిస్తూ కార్మికుల అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టారు.ఈ సమావేశంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారి బి.అశోక్, వి.సత్యక్క, ఐఎఫ్ టియు  జిల్లా నాయకులు సాగర్, అనిల్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.