– సంయుక్త విజేతలుగా కార్ల్సన్, నెపొమ్నియాషి
– ఫిడె ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్
న్యూయార్క్ (అమెరికా): చదరంగం చరిత్రలో తొలిసారి ఇద్దరు రాజులు అవతరించారు!. ఫిడె ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను మాగస్ కార్ల్సన్ (నార్వే) నిలుపుకున్నాడు. కానీ రష్యా గ్రాండ్‌మాస్టర్ ఐయాన్ నెపొమ్నియాషితో కలిసి టైటిల్‌ను సంయుక్తంగా పంచుకున్నాడు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను ఇద్దరు పంచుకోవటం ఇదే ప్రథమం. మాగస్ కార్ల్సన్, ఐయాన్ నెపొమ్నియాషి ఫైనల్ డ్రాగా ముగిసింది. విజేతను తేల్చేందుకు మూడు టైబ్రేకర్లు పెట్టినా.. అవీ డ్రాగా ముగిశాయి. 3.5-3.5 పాయింట్లతో కార్ల్సన్, నెపొమ్నియాషి సమవుజ్జీలుగా నిలిచారు. ఈ సమయంలో కార్ల్సన్ టైటిల్‌ను పంచుకుందామని ప్రతపాదించగా నెపొమ్నియాషి అంగీకరించాడు. ఫైనలిస్ట్‌ల అభ్యర్థనను పరిశీలించి ఫిడె అధికారులు.. కార్ల్సన్, నెపొమ్నియాషిలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. సుదీర్ఘ కెరీర్లో ఒక్క టైటిల్ సాధించని నెపొమ్నియాషి.. 2024 బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌ను కార్ల్సన్తో పంచుకుని చరిత్ర పుటల్లో నిలిచాడు. మహిళల విభాగంలో చైనా గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ క్లాసికల్ చాంపియన్ జు వెంజున్ విజేతగా నిలిచింది. వాలెంటీనా, వైశాలిపై వరుసగా క్వార్టర్స్, సెమీఫైనల్లో విజయాలు సాధించిన వెంజున్ టైటిల్ పోరుకు చేరుకుంది. ఫైనల్లో సహచర గ్రాండ్‌మాస్టర్ లీపై వెంజున్ పైచేయి సాధించింది. తొలి ఐదు గేములు డ్రాగా ముగియగా.. ఆరో గేమ్‌లో వెంజున్ విజయం సాధించింది. ప్రపంచ మహిళల బ్లిట్జ్ చాంపియన్‌గా నిలిచింది. భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి టైటిల్ వేటకు సెమీఫైనల్లో తెరపడింది.